‘క్రేజీవాల్’ ఐడియా బ్యాక్ ఫైర్ అయింది అందుకే...

October 07, 2016


img

ఆయన పేరు అరవింద్ కేజ్రీవాల్ కాదు...‘క్రేజీవాలా’ అంటున్నారిప్పుడు దేశంలో చాలా మంది. అందుకు కారణం సర్జికల్ స్ట్రయిక్స్ కి వీడియో సాక్ష్యాధారాలు చూపించమని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే. 

ఆయన అలాగ డిమాండ్ చేసినందుకు పాకిస్తాన్ ప్రజలకి హీరో అయిపోయారిప్పుడు. అక్కడి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డాన్ తో సహా అన్ని దినపత్రికలలో ఆయన ఫోటోని ప్రధాన పేజీలలో వేసి, “పాక్ తరపున భారత ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హీరో ఇతనే” అంటూ కధనాలు ప్రచురించాయంటే ఆయన క్రేజినెస్ పాకిస్తాన్ కి ఎంతగా నచ్చేసిందో అర్ధం చేసుకోవచ్చు. కానీ భారత్ లో ప్రజలకి మాత్రం ఆయనొక విలన్ లాగ చూస్తున్నారిప్పుడు. ఆయన అరవింద్ కేజ్రీవాల్ కాదు ఒక క్రేజీవాలా అని తిట్టిపోస్తున్నారు. 

నిజానికి కేజ్రీవాల్ పాకిస్థాన్ని ఏమీ ప్రేమించడం లేదు. అలాగే ప్రధాని మోడీని కూడా అస్సలు ప్రేమించడం లేదు. సర్జికల్ స్ట్రయిక్స్ కారణంగా మోడీ పేరు దేశవిదేశాలలో మారుమ్రోగిపోతుండటం జీర్ణించుకోలేక, ఆయన రాజకీయ లబ్ది పొందేందుకే సర్జికల్ స్ట్రయిక్స్ చేసినట్లు అబద్దాలు చెపుతున్నారని, నిజంగా సర్జికల్ స్ట్రయిక్స్ చేసి ఉండి ఉంటే, వాటికి వీడియో సాక్ష్యాధారాలు చూపించాలని సవాలు విసిరారు. 

మోడీ రాజకీయ లబ్ది పొందేందుకే సర్జికల్ స్ట్రయిక్స్ చేసినట్లు అబద్దాలు చెపుతున్నారని మొదట పాక్ వాదించడం మొదలుపెట్టింది. అది భారత్ చేతిలో దెబ్బ తింది కనుక ఎటువంటి వితండవాదన అయినా చేయవచ్చు. కానీ ఒక భారతీయ పౌరుడుగా..అందునా డిల్లీ ముఖ్యమంత్రి వంటి చాలా కీలకమైన పదవిలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆవిధంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటంతో యావత్ భారతీయులు ఆయనపై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. 

సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో ఎవరూ ఊహించని పాయింట్ లాగి మోడీని భలే దెబ్బ తీశానని మురిసిపోతున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రజాగ్రహాన్ని చూసి కంగారుపడ్డారు. తన ఐడియా బ్యాక్ ఫైర్ అయిందని గ్రహించి తన తప్పుని కప్పిపుచ్చుకొనే ప్రయత్నంలో, “పాక్ దుష్ప్రచారాన్ని తెలివిగా బయటపెట్టిన భారత్ మీడియాకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే భారత ప్రభుత్వం కూడా పాక్ దుష్ప్రచారాన్ని గట్టిగా త్రిప్పికొట్టాలని కోరుకొంటున్నాను,” అని ఒక ట్విట్ మెసేజ్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఆయన కూడా సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినట్లు ఒప్పుకొంటున్నట్లు స్పష్టం అవుతోంది. అంటే రాజకీయ దురుదేశ్యంతోనే సర్జికల్ స్ట్రయిక్స్ జరుగలేదని, వాటికి సాక్ష్యాధారాలు చూపించాలని డిమాండ్ చేసినట్లు అంగీకరించినట్లు కూడా అయ్యింది.   

దేశ భద్రత, దేశ గౌరవానికి సంబంధించిన అతి సున్నితమైన అంశంపై ఈవిధంగా రాజకీయాలు చేసినందుకు ఇప్పటికే ప్రజలలో ఆయన పట్ల వ్యతిరేకభావం ఏర్పడింది. ఆ తప్పుని ఆయన కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేసినప్పటికీ రాబోయే ఎన్నికలలో అందుకు ఆమాద్మీ పార్టీ మూల్యం చెల్లించవలసి రావచ్చు. 


Related Post