వ్యవసాయచట్టాలపై అంత మొండిపట్టుదలదేనికి? సుప్రీం

January 11, 2021


img

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను బేషరతుగా రద్దు చేయాలని కోరుతూ గత నెల్లన్నర రోజులుగా ఢిల్లీలో వేలాదిమంది రైతులు ఆందోళన చేస్తున్నారు. వారితో కేంద్రప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించకపోవడం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. 

కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని...ఈ వ్యవహారంలో దాని వైఖరిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసింది. వేలాదిమంది రైతులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరవధికంగా ఆందోళనలు చేస్తుంటే కేంద్రప్రభుత్వం అంత మొండిగా ఎందుకు వ్యవహరిస్తోందని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రప్రభుత్వం చర్చల పేరుతో కాలక్షేపం చేస్తుంటే మరోపక్క రైతుల ఆత్మహత్యలు చేసుకొంటున్నారని, దీనికి కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని అంది. అసలు ఈ చట్టాలపై పార్లమెంటులో క్షుణ్ణంగా చర్చించి సభ్యులందరి ఆమోదం పొందకుండా మూజువాణి ఓటుతో ఎందుకు ఆమోదించవలసివచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోయినా వాటిని తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయడం లేదని ప్రశ్నించింది. ఒకవేళ కేంద్రం ఈ పనిచేయకపోతే తామే వాటిపై స్టే విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. 

ఇప్పటివరకు ఈ చట్టలపై దేశంలో ప్రతిపక్షాలు, కొన్ని రాష్ట్రాలు, వాటిలో రైతులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వాటి అమలుపై పునరాలోచన చేయాల్సిందేనని హెచ్చరించడంతో కేంద్రప్రభుత్వం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసివస్తుంది. సుప్రీంకోర్టును కాదని వాటిని అమలుచేయాలని చూస్తే కోర్టు స్టే విధిస్తుంది. ఒకవేళ వెనక్కు తగ్గితే ప్రతిపక్షాలు పైచేయి సాధించినట్లవుతుంది. అది బిజెపికి రాజకీయంగా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కనుక వీటిపై కేంద్రప్రభుత్వం ముందుకు వెళ్ళినా వెనక్కు తగ్గినా ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్ట మసకబారే అవకాశం ఉంది. 


Related Post