కాంగ్రెస్‌ అధిష్టానంపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు

January 11, 2021


img

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో భాజాపాలో చేరనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బహుశః అందుకే సొంతపార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించడం మొదలుపెట్టినట్లున్నారు. 

హైదరాబాదులో హయత్‌నగర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇంత హడావుడి చేసి చివరికి పిసిసి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయకపోవడం విడ్డూరమన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్న జానారెడ్డే పిసిసి అధ్యక్షుడి ఎంపిక జరుగకుండా అడ్డుకున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. సాగర్ ఉపఎన్నికలలో ఎక్కడ ప్రభావం చూపుతుందనే భయంతోనే టిపిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయడాన్ని రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా ఓడిపోయిన వ్యక్తి ఏవిధంగా నిర్ణయాలు తీసుకొంటారనిప్రశ్నించారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్-పిసిసి అధ్యక్షుడి మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనే బిజెపిలో చేరాలనుకున్నారు. కానీ అప్పుడు ఆయన అనుచరులే తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో బిజెపి బలపడటంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్దపడుతున్నారు. అయితే బిజెపిలో చేరాలనుకొంటున్నానని ప్రకటించి 15 రోజులైనా ఇంకా ఎందుకు చేరలేదో తెలీదు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి మాట్లాడటం, పార్టీ నిర్ణయాలను విమర్శించడం సరికాదనే చెప్పాలి. అలాగే పార్టీలో ఉంటూ సొంతపార్టీనే విమర్శిస్తూ ఇబ్బంది కలిగిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలీదు. 


Related Post