ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా

December 04, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలవడంతో పార్టీ ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రేపు కాంగ్రెస్‌ అధిష్టానానికి పంపించనున్నారు.

దుబ్బాక ఉపఎన్నికలలో తప్పకుండా గెలుస్తామనే నమ్మకంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు చాలా గట్టిగా కృషి చేసినప్పటికీ టిఆర్ఎస్‌-బిజెపిల మద్య కాంగ్రెస్‌ అభ్యర్ధి అడ్రస్ లేకుండా పోయారు. మళ్ళీ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో అదే కధ పునరావృతం అయ్యింది. టిఆర్ఎస్‌-బిజెపిల పోటీ కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ 149 డివిజన్‌లకు పోటీ చేయగా కేవలం రెండు డివిజన్‌లలో మాత్రమే గెలుచుకోగలిగింది.

నిజానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపజేసుకొన్నప్పటికీ తట్టుకొని నిలబడగలిగింది. కానీ రాష్ట్ర బిజెపికి బండి సంజయ్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా మారింది. ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో బిజెపి అనూహ్యంగా బలం పుంజుకొని టిఆర్ఎస్‌ను బలంగా ఢీకొనడం ప్రారంభించినప్పటి నుంచి ఆ రెండు పార్టీల మద్య కాంగ్రెస్‌ పార్టీ లేగదూడలా నలిగిపోతోంది. ప్రతీ ఎన్నికలను టిఆర్ఎస్‌-బిజెపి మద్య పోటీగా మార్చేయడంలో బండి సంజయ్‌ సఫలం అవడంతో ఆ పోటీలో కాంగ్రెస్ పార్టీ కనబడకుండా పోతోంది. తెరాస కారణంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని అందరూ అనుకొన్నారు కానీ ఊహించనివిధంగా బిజీపీ కారణంగా నష్టపోతోంది. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి అత్యవసరంగా ఓ బాహుబలి చాలా అవసరం. ఆ బాహుబలి ఎవరో?


Related Post