పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఎందుకు పోరాటానికి సిద్ధం అయ్యారు?

September 06, 2016


img

ప్రత్యేక హోదా గురించి ఏనాడూ పెద్దగా మాట్లాడటానికి కూడా ఇష్టపడని పవన్ కళ్యాణ్ హఠాత్తుగా తిరుపతిలో బహిరంగ సభ ఎందుకు పెట్టారు? మళ్ళీ ఈనెల 9న కాకినాడలో సభ ఎందుకు పెడుతున్నారు? అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆయనని తను మాటలతో రెచ్చగొట్టడం వలనే గుహలో నుంచి బయటకి వచ్చాడని అందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు తనకి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పుకొన్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా గొప్పలు చెప్పుకొన్నారు. అంతే కాదు ఆయన దాని కోసం తెదేపా నుంచి ప్యాకేజి కూడా తీసుకొన్నారని ఆరోపించారు.

రాజకీయ విశ్లేషకులు కూడా పవన్ కళ్యాణ్ ఎంట్రీని రకరకాల కోణాల నుంచి విశ్లేషించి చూపించారు. కాపులకి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం ఈనెల 11న రాజమండ్రిలో కాపు సంఘాల నేతలతో సమావేశమయ్యి తన భవిష్య కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. కనుక ఆయన ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకే పవన్ కళ్యాణ్ ని తెదేపా ముందుకు తీసుకువచ్చిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తే, మరికొందరు ప్రత్యేక హోదా, తదితర హామీల అమలు చేయడానికి వెనుకాడుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే తెదేపా ఆయనని ముందుకి తీసుకువచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు తెదేపా దూకుడికి కళ్ళెం వేయడం కోసమే భాజపాయే ఆయనని ముందుకు తీసుకువచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవేమీ కాదు... ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం, దానిని పుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్నాయి కనుక వాటిని అడ్డుకొని ప్రత్యేక హోదా సాధించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ప్రజల ముందుకు రావలసి వచ్చిందని, ప్రత్యేక హోదా రాదని ఖచ్చితంగా తెలిసింది గనుకనే ఇక పోరాటాలకి సిద్ధం అవుతున్నారని అభిమానులు అనుకొంటున్నారు.

ఆయన ఒకసారి ఎంట్రీ ఇస్తేనే దాని గురించి ఇన్నిభిన్నాభిప్రాయలు వినపడుతున్నాయి. వాటిలో నిజానిజాలు ఏమిటో మున్ముందు అందరికీ తెలుస్తుంది కనుక అంతవరకు ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకోవచ్చు. రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నట్లు ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే తెదేపా లేదా భాజపా చేతిలో కీలుబొమ్మగా మారి ప్రత్యేక హోదా గురించి భూటకపు పోరాటాలు చేసినట్లయితే దాని వలన చివరికి ఆయనే ప్రజల విశ్వసనీయత కోల్పోయి నష్టపోతారు తప్ప ఆ రెండు పార్టీలు కాదు. అప్పుడు వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసినా దానికీ ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే పట్టిస్తారు ప్రజలు. ఈ సంగతి పవన్ కళ్యాణ్ కి తెలియదనుకోలేము. కనుక తన నిజాయితీని నిరూపించుకొని ఈ అనుమానాలన్నిటికీ గట్టిగా సమాధానం చెప్పవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదే ఉందని చెప్పవచ్చు.


Related Post