టిఆర్ఎస్‌-బిజెపిల ఎన్నికల రాజకీయాలు అదుర్స్

November 21, 2020


img

దుబ్బాక ఉపఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా టిఆర్ఎస్‌-బిజెపిల మద్యనే పోటీగా మారబోతున్నట్లు కనిపిస్తున్నాయి. సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు బిజెపినే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండటం, వాటికి బిజెపి కూడా అంతేఘాటుగా బదులిస్తుండటమే ఇందుకు నిదర్శనం. 

‘వరదసాయాన్ని నిలిపివేయించి ప్రజల నోటికాడ కూడు బిజెపియే కొట్టేసిందని’ సిఎం కేసీఆర్‌ ఆరోపించగానే, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవితతో సహ టిఆర్ఎస్‌ నేతలందరూ ఆదేపాట అందుకొన్నారు. వరద సాయం అందకపోవడంతో తలెత్తిన ప్రజాగ్రహాన్ని తెలివిగా బిజెపిపైకి మళ్ళించి దానిని దోషిగా నిలబెట్టడం ద్వారా జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఆ పార్టీని దెబ్బ తీయాలని టిఆర్ఎస్‌ భావించింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో బిజెపి అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తోందంటూ మంత్రులు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు.  

అయితే టిఆర్ఎస్‌ ఆరోపణలపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా చాలా తెలివిగా, ధీటుగా స్పందించారు. ‘ఆ ఆరోపణలపై ఛార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణాలు చేయడానికి రావాలంటూ’ సిఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు అటువంటి సవాళ్ళను స్వీకరించారని ఆయనకీ తెలుసు. కనుక బండి సంజయ్‌ ఒక్కరే నిన్న మధ్యాహ్నం తన పార్టీ కార్యకర్తలను వెంటపెట్టుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ‘వరదసాయాన్ని నిలిపి వేయాలని నేను ఎన్నికల సంఘానికి లేఖ వ్రాయలేదంటూ’ ప్రమాణం చేసి కధను రక్తి కట్టించారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు వరద బాధితులందరికీ వరదసాయం అందించిన తరువాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్ళి ఉంటే బాగుండేదని అన్నారు. మజ్లీస్ సాయంతో నగరంలోని ముస్లింల ఓట్లను పొందాలనే ఆలోచనతోనే టిఆర్ఎస్‌ బిజెపిపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. టిఆర్ఎస్సే మత రాజకీయాలు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. 

హిందువుల ఓట్లపైనే బిజెపి ప్రధానంగా ఆధారపడుతుంది కనుక బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేసి, టిఆర్ఎస్‌ను మజ్లీస్‌తో జోడించి ప్రత్యారోపణలు చేయడం ద్వారా హిందూ సెంటిమెంట్ సృష్టించే ప్రయత్నం చేసినట్లు అర్ధమవుతోంది. 

టిఆర్ఎస్‌-బిజెపిల మద్య జరుగుతున్న ఈ మాటల యుద్ధాలతో ఉద్రిక్తతలు, సెంటిమెంట్లు పెరగడం తప్ప నగర ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని అందరికీ తెలుసు. రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకే ఇటువంటి వ్యూహాలను అమలుచేస్తున్నాయని భావించవచ్చు.


Related Post