జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో టిఆర్ఎస్‌ ఒత్తిడికి గురవుతోందా?

November 20, 2020


img

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మంత్రి కేటీఆర్‌ ఒక్కరే ఒంటిచేత్తో ఎన్నికల ప్రచారం చేసి టిఆర్ఎస్‌ను గెలిపించుకొన్నారు. కానీ ఈసారి మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా రంగంలో దిగుతున్నారు. ఈనెల 28న సిఎం కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో ఎన్నికల ప్రచారసభ నిర్వహిస్తుండటం నిజమే అయితే కాంగ్రెస్‌, బిజెపిల నుంచి టిఆర్ఎస్‌ గట్టి పోటీ ఎదుర్కొంటోందని దృవీకరించినట్లవుతుంది. ఈసారి టిఆర్ఎస్‌ 100కు పైగా సీట్లు గెలుచుకొంటామని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. కానీ అది అంత సులువు కాదని దాని కోసం ఈసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ చెమటోడ్చక తప్పదని సిఎం కేసీఆర్ మాటలలోనే స్పష్టమయ్యింది.  

అయితే గత ఆరేళ్ళలో హైదరాబాద్‌ నగరాన్ని టిఆర్ఎస్‌ ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేసింది. నగరానికే వన్నె తెచ్చిన దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జితో సహా అనేక ఫ్లై ఓవర్లను నిర్మించింది. అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలలో అనేక చిన్నా, పెద్ద పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వాటన్నిటి ద్వారా యువతకు భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బస్తీ దవాఖనాల వంటి అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది. టిఆర్ఎస్‌కు ఇన్ని సానుకూలతలు ఉన్నందున జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో అవలీలగా గెలిచే అవకాశాలున్నాయి. కానీ ఎన్నికలంటే ఆటవిడుపుగా భావించే టిఆర్ఎస్‌ తొలిసారిగా ఒత్తిడికి గురవుతున్నట్లుంది. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.  

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్‌ నగరవాసులు అల్లాడిపోవడం, వారిని ప్రసన్నం చేసుకొనేందుకు సిఎం కేసీఆర్‌ వరదసాయం ప్రకటించినా అది బెడిసికొట్టడం, వరదసాయం అందని ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉండటం వంటివి కాంగ్రెస్‌, బిజెపిలకు బలమైన అస్త్రాలుగా లభించాయి. మొదట డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు పంచిపెట్టిన తరువాత టిఆర్ఎస్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్లాలనుకొంది. కానీ ఇళ్ళు పంపిణీ చేయకుండానే ఎన్నికలకు వెళుతోంది. ఉద్యోగాల కల్పనపై యువత అసంతృప్తిగా ఉంది. 2018 శాసనసభ ఎన్నికలో నిరుద్యోగభృతి ఇస్తామని టిఆర్ఎస్‌ హామీ ఇచ్చింది. కనీసం అది ఇచ్చినా కొంత ఉపశమనం లభించేది. కానీ టిఆర్ఎస్‌ ఆ హామీని కూడా అమలుచేయకపోవడంతో నిరుద్యోగయువతలో అసంతృప్తి ఉండటం సహజం. 

కాంగ్రెస్‌, బిజెపిలకు ఇవన్నీ అస్త్రాలుగా లభించాయి. టిఆర్ఎస్‌ అందించిన ఆ అస్త్రాలనే అవి దానిపైకి ప్రయోగించబోతున్నాయి. 

ముఖ్యంగా... దుబ్బాకలో తెరాస కంచుకోటను బద్దలు కొట్టి దానిపై కాషాయజెండా ఎగురవేయడంతో బిజెపి నేతలు, శ్రేణులు చాలా సమరోత్సాహంతో ఉన్నారు. దుబ్బాక ఉపఎన్నికలలో ‘టిఆర్ఎస్‌ను ఓడించే ఫార్ములా’ను కనుగొన్నట్లు వారు భావిస్తున్నారు. గట్టిగా కృషిచేస్తే తమ వ్యూహాలు ఫలిస్తాయని దుబ్బాకలోనే అర్ధం చేసుకొన్నారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఏమీ చేయలేదని మంత్రి హరీష్‌రావు ఎంతగా వాదించినా దుబ్బాక ప్రజలు బిజెపినే గెలిపించడమే అందుకు కారణం. కనుక ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో...అదే ఊపులో గ్రేటర్ గులాబీ కోటను బద్దలుకొట్టి వశపరుచుకోవాలని బిజెపి నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అది సాధ్యమా కాదా అనేది పక్కన పెడితే వారి సమరోత్సాహం వారి మాటలలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 

ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ 100కు పైగా సీట్లు సాధిస్తుందా లేదా? ఈ ఎన్నికలలో కూడా బిజెపి టిఆర్ఎస్‌ను ఓడిస్తుందా లేక దాని విజయావకాశాలను దెబ్బ తీస్తుందా? టిడిపి, జనసేనలు కూడా బరిలో దిగడం వలన టిఆర్ఎస్‌కు నష్టం కలుగుతుందా లేదా? అనే సందేహలన్నిటినీ పక్కన బెడితే ఇటువంటి పరిస్థితులలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్లడమే పొరపాటు లేదా తొందరపాటుగా కనిపిస్తోంది.

పరిస్థితులు చక్కబడిన తరువాత ఎన్నికలకు వెళ్ళి ఉండి ఉంటే టిఆర్ఎస్‌కు ఎదురీదవలసిన అవసరమే ఉండేది కాదేమో? కానీ బహుశః దుబ్బాక ఓటమికి బిజెపిపై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్ళినందునే టిఆర్ఎస్‌ ఒత్తిడి ఎదుర్కోవలసివస్తోందని చెప్పకతప్పదు. ఏది ఏమైనప్పటికీ టిఆర్ఎస్సే ఈ యుద్ధభేరీని మ్రోగించింది కనుక ఈ యుద్ధంలో గెలిచి తీరాల్సిందే. అందుకు ఎంతైనా చెమటోడ్చాల్సిందే. తప్పదు.


Related Post