ఆ హామీలు ఆచరణ సాధ్యమేనా?

November 20, 2020


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా  గురువారం అనేక హామీలు ప్రకటించారు. అయితే అవి నమ్మశక్యంగా లేవు ఆచరణ సాధ్యమైనవిగా కనిపించడం లేదు. ఎందుకంటే, హైదరాబాద్‌లో ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున వరదసాయం అందిస్తామని చెప్పిన టిఆర్ఎస్‌ ఆ హామీ అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.660 కోట్లు ఖర్చు చేసిందని చెపుతోంది. అయినా లక్షలాదిమంది ప్రజలు వరదసాయం కోసం ఇంకా దరఖాస్తు చేసుకొంటూనే ఉన్నారు. ఖజానా ఖాళీ అయిపోయినా వారందరికీ ఇవ్వడం కష్టమేనని అందరికీ తెలుసు. ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున వరదసాయం ఇవ్వడమే కష్టంగా ఉన్నప్పుడు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి గెలిస్తే ఒక్కో కుటుంబానికి రూ.25,000 చొప్పున వరదసాయం అందిస్తామని బండి సంజయ్‌ హామీ ఇస్తున్నారు.   

 ఆరున్నరేళ్ళుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న టిఆర్ఎస్‌ ప్రభుత్వం 2014, 2018 శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి వంటి హామీలనే ఇంతవరకు అమలుచేయలేకపోయింది. రాష్ట్రంలో ఎన్నడూ అధికారమే చేపట్టని బిజెపి కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గెలిస్తే ఈ హామీలన్నిటినీ ఎలా అమలుచేయగలదు? రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏవిధంగా ఈ హామీలన్నిటినీ అమలుచేయగలదు?వాటికి ఎక్కడి నుంచి నిధులు తెస్తుంది? అనే సందేహాలు కలుగకమానవు. ఇంతకీ బండి సంజయ్‌ ఏమేమి హామీలు ఇచ్చారంటే... 

1. హైదరాబాద్‌లో వరద బాధితులందరికీ ఒక్కో కుటుంబానికి రూ.25,000 చొప్పున వరదసాయం అందిస్తాము.

2. వరదలలో ద్విచక్ర వాహనం కోల్పోయినవారికి మళ్ళీ ద్విచక్రవాహనం, కార్లు పోయినవారికి మళ్ళీ కొత్త కార్లు ఇప్పిస్తాము. 

3. వరదలలో ఇంట్లో ఫర్నీచర్ పోతే కొత్త ఫర్నీచర్ ఇస్తాము. 

4. ప్రతీ ఇంటికి ఎంత నష్టం జరిగిందో అంచనావేయించి దానికి పూర్తి నష్టపరిహారం చెల్లిస్తాము. 

5. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఇష్టం వచ్చినట్లు చలాన్లు వసూలు చేస్తున్నారు. ఈ ఎన్నికలలో మేము గెలిస్తే వాటిని జీహెచ్‌ఎంసీయే భరిస్తుంది. 


Related Post