బిజెపిపై హరీష్‌రావు ఆగ్రహం... దేనికి సంకేతం?

October 30, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అవలీలగా భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆశిస్తే, బిజెపి వ్యూహాలతో ఎదురీదవలసివస్తోంది. టిఆర్ఎస్‌ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్న మంత్రి హరీష్‌రావు ఆగ్రహం చూస్తే ఆ విషయం అర్ధవుతుంది. 

ఇవాళ్ళ సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి అబద్దాల పునాదుల మీద విజయం సాధించాలనుకొంటోంది. అందుకోసం రాష్ట్ర స్థాయి నేతల మొదలు గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరూ కూడా పచ్చి అబద్దాలు చెపుతున్నారు. ఒక అబద్దాన్ని పదేపదే నొక్కి చెపితే నిజమైపోదు. బిజెపి అభ్యర్ధి బందువుల ఇంట్లో డబ్బు పట్టుబడితే పోలీసులే ఆ డబ్బును ఆయన ఇంట్లో పెట్టేందుకు తీసుకువచ్చి పట్టుబడ్డారని బిజెపి సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తోంది. 

రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇస్తున్న పింఛన్లు, రాయితీ ధరలపై గొర్రెల పంపిణీ, బియ్యంపై రాయితీకి, ధాన్యం కొనుగోలుకు కేంద్రం రూ.5,500 కోట్లు నిధులు ఇచ్చిందంటూ బిజెపి నేతలు ప్రచారం చేసుకొంటున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో పింఛన్లు ఇవ్వని కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇస్తుంది?అని దుబ్బాక ప్రజలు ఆలోచించాలి. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి పైసా ఇవ్వకపోయినా అన్నీ కేంద్రమే ఇచ్చిందన్నట్లు బిజెపి నేతలు, కార్యకర్తలు అబద్దాలు చెపుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బిజెపి నేతలు నిసిగ్గుగా సంక్షేమ పధకాల గురించి వరుసగా అబద్దాలు చెపుతూ వాటితో ప్రజలను మభ్యపెట్టి నమ్మించి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. దుబ్బాకలో లేని మెడికల్, పాలిటెక్నిక్ కాలేజీలను నేను సిద్ధిపేటకు తరలించుపోయానని అబద్దాలు చెపుతున్నారు. బిజెపికి చెందిన కొందరు వ్యక్తుల ద్వారా సోషల్ మీడియాలో కూడా టిఆర్ఎస్‌ ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేయిస్తోంది. అయితే దుబ్బాక ప్రజలు చాలా చైతన్యవంతులు. వారు అబద్దాలు, దుష్ప్రచారం గెలవాలనుకొంటున్న బిజెపికి తమ ఓట్లతో తప్పకుండా బుద్ధి చెపుతారని ఆశిస్తున్నాను,” అని అన్నారు. 

దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బిజెపి నేతలను, కార్యకర్తలను టిఆర్ఎస్‌లో చేర్చుకొన్నారు. అది టిఆర్ఎస్‌ ఎన్నికల వ్యూహంలో భాగమైనప్పుడు బిజెపి కూడా అందుకు ప్రతిగా ఏదో ఓ వ్యూహం అమలుచేయడం సహజం. అది మంచిదైనా చెడ్డదైనా మంత్రి హరీష్‌రావు దానిని ధీటుగా ఎదుర్కొక తప్పదు. కానీ అందుకు బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆయనే ఒత్తిడికి గురవుతున్నట్లు సంకేతాలు పంపినట్లవుతుంది. ఎప్పుడూ మొహాన్న చిర్నవ్వుతో కనిపించే మంత్రి హరీష్ రావు ఇంతగా ఆగ్రహం చెందడం గమనిస్తే బీజేపీ నేతలు ఆయనను ఎంతగా చికాకుపెడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయినా ఏనాడు కాంగ్రెస్‌ను తప్ప బిజెపిని పట్టించుకోని టిఆర్ఎస్‌, దుబ్బాక ఉపఎన్నికలలో కేవలం బిజెపి గురించి మాత్రమే ఇంతగా మాట్లాడుతోందంటే బిజెపి  వ్యూహాలు పనిచేస్తున్నాయని, టిఆర్ఎస్‌కు బిజెపి గట్టి పోటీయే ఇస్తోందని అర్ధమవుతోంది. 


Related Post