రైల్వే ప్రయాణికులకు కొత్త సౌకర్యం…ఉపయోగపడేనా?

October 23, 2020


img

రైల్వేశాఖ ప్రయాణికుల కోసం కొత్త సౌకర్యం అందుబాటులోకి తెస్తోంది. అదే...‘బ్యాగ్స్ ఆన్‌ వీల్స్’. చాలా మంది ప్రయాణికులు తమ లగేజీతో రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. అటువంటివారి కోసమే ఈ పధకం. దీనిలో మొబైల్ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకొన్నట్లయితే రైల్వే సిబ్బంది మీ ఇంటి నుంచి లగేజీని రైల్వేస్టేషన్‌కు, అదేవిధంగా ట్రెయిన్ దిగిన తరువాత రైల్వేస్టేషన్‌ నుంచి మీ ఇంటికి మీ లగేజీని తీసుకువచ్చి అందజేస్తారు. 

ప్రస్తుతం ఉత్తర ఢిల్లీ డివిజన్‌లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఢిల్లీ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ సారాయ్ రోహిల్లా, ఘజియాబాద్, గురుగావ్ రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపింది. త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వేశాఖ తెలిపింది. ఈ సేవలకు నామమాత్రపు చార్జీలను చెల్లించవలసి ఉంటుందని తెలిపింది.    

అయితే ప్రయాణికులు తమ లగేజీతో సహా రైల్వేస్టేషన్‌కు, అదేవిధంగా స్టేషన్ నుంచి ఇంటికి చేరుకొనేవిధంగా సౌకర్యం కల్పిస్తే దానికి మంచి ఆదరణ లభించి ఉండేదేమో? కానీ ప్రయాణికులు వేరేగా, వారి లగేజీ వేరేగా గమ్యస్థానాలకు చేరాలనుకోవడం సరైన ఆలోచనకాకపోవచ్చు. ఎందుకంటే ప్రయాణికులు ఇంటి నుంచి స్టేషన్‌కు, అలాగే స్టేషన్ నుంచి ఇంటికి చేరుకొనేందుకు ఏదో ఓ వాహనంలో వెళ్ళక తప్పదు. సొంత వాహనం ఉంటే దానిలోనే లాగేజీ కూడా పట్టుకుపోవచ్చు లేకపోతే ఆటో, క్యాబ్, బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. అందుకు డబ్బు చెల్లించాలి. మళ్ళీ లగేజీ రవాణాకు రైల్వేశాఖకు వేరేగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 

పైగా లగేజీ విషయంలో భారతీయులకు జాగ్రత్త, చాదస్తాలు కాస్త ఎక్కువే కనుక ఎంతమంది తమ లగేజీ రవాణాకు ఛార్జీలు చెల్లించి రైల్వేసిబ్బందికి అప్పగించేందుకు ఇష్టపడతారో తెలీదు. అయితే భారీ లగేజీతో బయలుదేరే ప్రయాణికులకు ఇది చాలా ఉపయోగకరంగానే ఉండవచ్చు. లగేజీని రైల్వే సిబ్బందికి అప్పగించి హాయిగా ఏ బస్సులోనో, ఆటోలోనో వెళ్ళిపోవచ్చు. కానీ లగేజీ రవాణాకు రైల్వేశాఖ ఎంత ఛార్జీ వసూలు చేస్తుంది?ఆ లగేజీకి ఎంత భద్రత ఉంటుంది?అనే దానిని బట్టి ఈ పధకం ఫలిస్తుందా లేదా అనేది తెలుస్తుంది.


Related Post