కీలకమైన లేఖను బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి

October 21, 2020


img

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఇవాళ్ళ ఓ కీలకమైన లేఖను ట్విట్టర్‌ వేదికగా బయటపెట్టారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పధకం సూపరింటెండెంట్‌ ఇంజనీర్ కె.అంజయ్య గత నెల 15వ తేదీన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం (పిఆర్ఐఎల్ఎస్) సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌కు వ్రాసిన లేఖ అది. 

ఆ లేఖ సారాంశమేమిటంటే, “కల్వకుర్తి ప్రాజెక్టుకు సమీపంలో ఎల్లూరు గ్రామంలో పిఆర్ఐఎల్ఎస్ పనులలో భాగంగా జరుపుతున్న ప్రేలుళ్ళ ప్రభావం కల్వకుర్తి ప్రాజెక్టులోని పంప్‌హౌస్‌పై పడుతోంది. అక్కడ ప్రతీరోజు జరుపుతున్న ప్రేలుళ్ళకు ఇక్కడ కంట్రోల్ రూమ్‌లో ప్రకంపనలు కలుగుతున్నాయి. ఈ ప్రకంపనలు స్విచ్ యార్డ్ మరియు పంప్‌హౌస్‌ పరికరాలకు నష్టం కలిగించే అవకాశం ఉంది. కనుక ఆ ప్రేలుళ్ళ వలన కల్వకుర్తి ప్రాజెక్టులోని యంత్ర పరికరాలకు నష్టం కలుగకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను.”


ఇటీవల కల్వకుర్తి ప్రాజెక్టు పంప్‌హౌస్‌లో ఓ పంప్‌మోటారు విరిగిపడటంతో పంప్‌హౌస్‌లో నీళ్ళు నిండిపోయిన సంగతి తెలిసిందే. కల్వకుర్తి ప్రాజెక్టుకు సమీపంలో పిఆర్ఐఎల్ఎస్ భూగర్బ పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం ప్రేలుళ్ళు జరుపడం వలన కల్వకుర్తి ప్రాజెక్టులో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు మొదటి నుంచి వాదిస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది. రేవంత్‌ రెడ్డి బయటపెట్టిన తాజా లేఖలో కూడా కల్వకుర్తి ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ కూడా అదే పేర్కొన్నారు. చివరికి అందరూ భయపడినట్లే కల్వకుర్తిలో ప్రమాదం జరిగి పంప్‌హౌస్‌ మునిగిపోయింది. మిగిలిన పంపులు కూడా నీట మునిగాయి. గత మూడు రోజులుగా సబ్-మెర్సిబుల్ పంప్‌సెట్లతో పంప్‌హౌస్‌లో నుంచి నీళ్ళు బయటకు తోడుతున్నారు. పూర్తిగా నీళ్ళు బయటకు తోడితే కానీ ఎంత నష్టం జరిగిందో తెలియదు. రేవంత్‌ రెడ్డి ఆ లేఖను జత చేసి సిఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Related Post