జనవరినాటికి కరోనా టీకాలు పక్కా: కేంద్రమంత్రి హర్షవర్ధన్

October 13, 2020


img

వచ్చే ఏడాది జనవరినాటికి ఒకేసారి వివిద సంస్థలు తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ (టీకాలు) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “వివిద సంస్థలు తయారుచేస్తున్న టీకాల పరీక్షలు తుది దశకు చేరుకొంటున్నాయి. కనుక ఒకటి కంటే ఎక్కువ సంస్థల నుంచి టీకాలు భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్‌ భారీ జనాభా దృష్ట్యా ఒకే కంపెనీ అవసరమైనన్ని టీకాలు సరఫరా చేయలేదు కనుక ఒకటికంటే ఎక్కువ కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకొని టీకాలు ఉత్పత్తి, సరఫరా చేయాలని భావిస్తున్నాము. టీకాల అందుబాటులోకి రాగానే వాటిని దేశవ్యాప్తంగా పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు మొదలుపెట్టాము,” అని చెప్పారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40 కంపెనీలు కరోనాకు టీకాలు తయారుచేసి పరీక్షిస్తున్నాయి. వాటిలో 10 టీకాలు మూడో దశ అంటే తుదిదశకు చేరుకొన్నాయి. కనుక ఈ ఏడాది చివరిలోగా లేదా జనవరి నెలాఖరులోగా భారత్‌లో ఖచ్చితంగా కరోనా టీకాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి,” అని చెప్పారు. 

కరోనా మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. 2020 సంవత్సరం మొత్తాన్ని ఆ మహమ్మారి మింగేసిందని చెప్పకతప్పదు. ఏటా ప్రపంచవ్యాప్తంగా వివిద దేశాలలో జరిగే పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, ఉత్సవాలు, క్రీడల పోటీలు, సభలు, జాతీయ అంతర్జాతీయ సమావేశాలను, ఎన్నికలు, చదువులు, ఉద్యోగాలు, ఉపాధులు, వ్యక్తులను, సంస్థలను, చివరికి ప్రభుత్వాలను అన్నిటినీ కరోనా మహమ్మారి కబళించివేసి ప్రజల బతుకులు దుర్బరం చేసింది. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ చితికిపోయింది. కోట్లాదిమంది కరోనాబారినపడ్డారు.  లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో 2020 సంవత్సరం మొత్తం నాశనం అయిపోయింది. కనుక కరోనా టీకాలు అందుబాటులోకి వస్తే 2021 సంవత్సరమైన సజావుగా సాగుతుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.


Related Post