ప్రధాని మోడీపై ఏపీ మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు

September 23, 2020


img

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ్ళ తిరుమల శ్రీవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల ఆనవాయితీ ప్రకారం అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే ఆలయంలో ప్రవేశించేముందు డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. జగన్ క్రీస్టియన్ అయినందున ఆయన కూడా డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయాలని టిడిపి, బిజెపిలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో అధికార వైసీపీ నేతలకు వారికీ మద్య మాటల యుద్ధం ప్రారంభం అయ్యింది. ఈ యుద్ధంలో వైసీపీ ప్రభుత్వం తరపున మంత్రి కొడాలి నాని పాల్గొంటూ ప్రతిపక్షాలు ఘాటుగా జవాబులు ఇస్తున్నారు. కానీ తిరుమల డిక్లరేషన్ గురించి ఆయన కాస్త అనుచితంగా మాట్లాడటంతో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల ఆలయ నియమాలను గౌరవిస్తూ డిక్లరేషన్‌పై సంతకం చేసి సతీసమేతంగా స్వామివారిని దర్శించుకోవాలని సోము వీర్రాజు సూచించారు. 

బిజెపి నేతలకు మరింత ఘాటుగా జవాబు ఇవ్వాలనే ఊపులో కొడాలి నాని నోరుజారి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లు ప్రస్తావించి అడ్డంగా ఇరుకొన్నారు.

మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, “ఆలయాలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలనే ఈ నియమం ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరికే ఎందుకు?ప్రధాని నరేంద్రమోడీ, యూపీ సిఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా ఎప్పుడూ ఒంటరిగానే ఆలయాలకు వెళ్ళి పూజాకార్యక్రమాలలో పాల్గొంటుంటారు కదా?కనుక ప్రధాని నరేంద్రమోడీ కూడా సతీసమేతంగా అయోధ్యలో రామాలయానికి వెళ్ళి పూజలు చేయమనండి. అయినా అమిత్ షా, కిషన్‌రెడ్డి వంటివారు ఓ పది మందిని వెంటేసుకొని వచ్చి ఏది చెపితే అది అందరూ చేస్తారా?ఎవరిని మంత్రి పదవిలో నుంచి తొలగించమంటే వారిని తొలగిస్తారా?సోము వీర్రాజు ఏపీ బిజెపి పగ్గాలు చేపట్టినప్పటి నుంచే రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి కనుక బిజెపి అధిష్టానం ఆయనని ఆ పదవిలో నుంచి తొలగిస్తుందా?తిరుమల డిక్లరేషన్ విషయంలో నేను నా మాటకు కట్టుబడి ఉన్నాను. దానిపై మరింత చర్చ జరుగవలసి ఉంది,” అని అన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, జి.కిషన్‌రెడ్డి, యోగీ ఆదిత్యనాద్‌లకు ఏపీలో జరుగుతున్న ఈ రాజకీయయుద్ధంతో సంబందమే లేదు. కానీ మంత్రి కొడాలి నాని వారి గురించి కూడా అనవసరంగా లేనిపోనివి మాట్లాడి బిజెపిని మరింత రెచ్చగొట్టారు. తమ పార్టీ అధినేతల గురించి ఈవిధంగా మాట్లాడినందుకు రాష్ట్ర బిజెపి నేతలు ఊరుకొంటారనుకోలేము. కనుక కొడాలి నాని మంత్రి పదవిని ఊడగొట్టేవరకు ఊరుకోకపోవచ్చు.


Related Post