దుబ్బాక ఉపఎన్నికలకు టిఆర్ఎస్‌ అస్త్రం అదే

September 22, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపిని ఎదుర్కోవడానికి కేంద్రం తెస్తున్న వ్యవసాయబిల్లులను అస్త్రంగా ఉపయోగించుకోవాలని టిఆర్ఎస్‌ నిర్ణయించుకొన్నట్లు మంత్రి హరీష్‌రావు మాటలతో స్పష్టమయ్యింది. దుబ్బాకలో పర్యటిస్తున్న మంత్రి హరీష్‌రావు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, కేంద్రం తెస్తున్న వ్యవసాయ చట్టంతో కార్పొరేట్ కంపెనీలు రైతులను దోచుకొంటాయని అన్నారు. దాంతో దేశంలో మళ్ళీ జమీందారీ వ్యవస్థ పుట్టుకొస్తుందన్నారు. సిఎం కేసీఆర్‌ తెలంగాణ రైతులకు ఉచితంగా విద్యుత్, నీళ్ళు ఇస్తూ, రైతుబందు, రైతు భీమా వంటి పధకాలను అమలుచేస్తుంటే, కేంద్రప్రభుత్వం విద్యుత్, వ్యవసాయ చట్టలతో రైతులను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించి, కార్పొరేట్ కంపెనీలను రైతులపైకి పంపిస్తే రైతులు ఏవిధంగా వ్యవసాయం చేయగలరని హరీష్‌రావు ప్రశ్నించారు. సిఎం కేసీఆర్‌ ఎల్లప్పుడూ రైతుల పక్షాన్న నిలబడి వారి సంక్షేమం కోసమే ఆలోచిస్తుంటారన్నారు. అందుకే రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరూ దానికి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. విద్యుత్, వ్యవసాయ చట్టలతో రైతులను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న బిజెపికి దుబ్బాక ఉపఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతు తెలుపుతూ ఆమోదించిన తీర్మానాలను కుల సంఘాల ప్రతినిధులు, పంచాయతీ వార్డు సభ్యులు మంత్రి హరీష్‌రావుకు అందజేశారు. 


Related Post