కేసీఆర్‌పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

August 12, 2020


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు సిఎం కేసీఆర్‌ తీరును ఆక్షేపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిన్న హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళుతుండగా దారిలో జనగామ-నెల్లుట్ల బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి లింగాల ఘణపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తరువాత సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. 

అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో నిరంకుశ అప్రజాస్వామిక పాలన సాగుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఎవరూ ఇళ్ళలో నుంచి కాలు బయటకు పెట్టకూడదు. పెడితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని కేసీఆర్‌ కోరుకొంటున్నారు. అందుకే పోలీసుల సాయంతో ప్రతిపక్ష నేతలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమసమయంలో రాష్ట్రంలో... కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాము. ఒకవేళ ఆనాడు మేము ఇలాగే ప్రతిపక్షాలు కాలుబయటపెట్టకుండా కట్టడి చేసి ఉంటే కేసీఆర్‌ ఎప్పటికైనా సిఎం అయ్యుండేవారా?వరంగల్ నగరంలో ఎవరో జ్యూతీరావు ఫూలే విగ్రహం ధ్వంసం చేశారు. ఆ వివరాలు తెలుసుకొని అక్కడే మరో కొత్త విగ్రహం ఏర్పాటు చేయడానికని నేను వెళుతుంటే దారిలోనే పోలీసులు అరెస్ట్ చేయడం దారుణం. ఒకవేళ ప్రతిపక్ష నేతలెవరూ రాష్ట్రంలో తిరిగేందుకు వీలులేదంటే అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించేస్తే సరిపోతుంది కదా? అధికార పార్టీ నేతలకు ఎటువంటి ఆంక్షలు ఉండవు. వారు ఇష్ట్రం వచ్చినట్లు ఎక్కడైనా తిరుగవచ్చు. కానీ ప్రతిపక్ష పార్టీల నేతలకు మాత్రం ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడానికి వీలులేదు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?” అని అన్నారు. 

తెలంగాణ ఉద్యమనేతగా ముందుండి పోరాటాలకు నాయకత్వం వహించిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత తెలంగాణలో ప్రతిపక్షాల, ప్రజల గొంతులు వినపడకుండా చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.


Related Post