పిసిసి అధ్యక్ష పదవి నాకే ఇవ్వాలి: జగ్గారెడ్డి

August 11, 2020


img

రాజకీయ నాయకులు అధికారం, పదవుల కోసం ఆరాటపడుతుండటం రోజూ చూస్తూనే ఉంటాము. కాంగ్రెస్ నేతలకు ఆ యావ మరికాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రజలు కరోనా మహమ్మారితో ఆపసోపాలు పడుతుంటే, సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం పిసిసి అధ్యక్ష పదవి కోసం మాట్లాడుతుండటమే అందుకు తాజా ఉదాహరణ. 

సంగారెడ్డిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న నేను పిసిసి అధ్యక్ష పదవికి అన్నివిధాల అర్హుడిని. పార్టీలో ఈ పదవిని ఆశిస్తున్న మిగిలినవారికంటే నేను ఎంతో సీనియర్‌ని. కనుక ఆ పదవి నాకే ఇవ్వాలని మీడియా ద్వారా మా పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ పదవి కోసంఢిల్లీ వెళ్ళి పైరవీలు చేయదలచుకోలేదు. ఇక్కడి నుంచే పార్టీ పెద్దలు, నా శ్రేయోభిలాషుల ద్వారా మా అధిష్టానానికి విన్నవించుకొంటాను. నాకు అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే పార్టీలో అందరినీ కలుపుకుపోగలను. అవసరమైతే గ్రామస్థాయి వరకు పర్యటించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలను. 

పార్టీలోపల, బయటా కొందరు వ్యక్తులు నాగురించి తెలిసీ తెలియకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. అటువంటివారికి ఏమైనా సందేహాలుంటే నేరుగా నాతో మాట్లాడితే బాగుంటుంది లేదా వారితో నేనే మాట్లాడేందుకు కూడా సిద్దమే. నేను చేస్తున్న రాజకీయాలు చాలా మందికి అర్ధం కావు. కానీ సమయం వచ్చినప్పుడు వాటి పరమార్ధం ఏమిటో అందరికీ తెలుస్తుంది. కనుక నా మాటలతో ఎవరూ అయోమయానికి గురికావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు జగ్గారెడ్డి.


Related Post