విమాన ప్రయాణికులకు మరికాస్త ఊరట కానీ...

July 13, 2020


img

విమాన ప్రయాణికులకు మరికాస్త ఊరటనిచ్చే విషయం చెప్పింది పౌరవిమానయాన శాఖ. ఇప్పటివరకు ప్రయాణతేదీకి రెండు నెలల ముందు వ్యవధిలో కరోనా సోకలేదని విమాన ప్రయాణికులు స్వీయ దృవీకరణ పత్రం ఇవ్వవలసివచ్చేది. అది ఇస్తేనే విమానయాన సంస్థలు టికెట్లు జారీ చేస్తున్నాయి. కానీ రెండు నెలల గడువు చాలా ఎక్కువ కావడంతో దానిని మూడు వారాలకు కుదిస్తున్నట్లు ప్రకటించింది. కనుక ఇకపై విమాన ప్రయాణికులు తమ ప్రయాణతేదీకి మూడు వారాలకు ముందు వ్యవధిలో తమకు కరోనా సోకలేదని స్వీయ దృవీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. 

కరోనా సోకి చికిత్సతో కోలుకొన్నవారిని కూడా విమాన ప్రయాణాలకు అనుమతించాలని పౌరవిమానయాన శాఖ నిర్ణయించింది. అయితే వారు కరోనా నుంచి పూర్తిగా కోలుకొన్నారని సంబందిత ఆసుపత్రి జారీ చేసిన దృవీకరణ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుందని తెలియజేసింది. 

దేశీయ విమాన సేవలు ప్రారంభం అయినప్పటికీ, దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరిగిపోతుండటం, ఒక్కో రాష్ట్రంలో  ఒక్కో రకమైన క్వారెంటైన్‌ నిబందనలు లేదా ఆంక్షలు ఉండటం వంటి అనేక కారణాల చేత విమానాలలో ప్రయాణించేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాంతో విమానయాన సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇప్పుడు కరోనా ఆంక్షలు సడలించి, కరోనా నుంచి విముక్తి పొందినవారిని కూడా విమాన ప్రయాణాలకు అనుమతించాలని నిర్ణయించడంతో విమానలలో ప్రయాణించేందుకు ప్రజలు మరింత వెనకాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, కరోనా నుంచి కోలుకొన్నవారు ఆసుపత్రుల నుంచి ఇళ్ళకు తిరిగివస్తుంటేనే ఇరుగుపొరుగులు అభ్యంతరాలు చెపుతున్నప్పుడు, ఒకే విమానంలో కరోనా నుంచి కోలుకొన్నవ్యక్తుల పక్కన కూర్చొని ప్రయాణించేందుకు సిద్దపడతారనుకోలేము. 


Related Post