కూల్చివేస్తుంటే పిటిషన్‌...తరువాత చూద్దాం!

July 09, 2020


img

సచివాలయం కూల్చివేత పనులు ముమ్మురంగా సాగిపోతున్నాయి. ఇప్పటికే చాలా భవనాలు కూల్చివేశారు. మరో వారం పది రోజులలో అన్ని భవనాలు నేలమట్టం అయిపోతాయి. ఈ సమయంలో కూల్చివేతలను నిలిపివేయాలని కోరుతూ ప్రొఫెసర్ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు బుదవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని, కూల్చివేతల దుమ్ముదూళితో పరిసర ప్రాంతాలలో  నివశిస్తున్న సుమారు 5 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కనుక తక్షణం కూల్చివేతలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రభాకర్ హైకోర్టును కోరారు. 

అయితే సచివాలయం కూల్చివేతపై గతంలోనే సుదీర్గవిచారణ జరిగింది కనుక ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరుపవలసిన అవసరంలేదని, మళ్ళీ సాధారణ పిటిషన్‌ దాఖలు చేస్తే మిగిలిన పిటిషన్లతో కలిపి తరువాత విచారణ చేపడతామని హైకోర్టు చెప్పింది.      

హైకోర్టు చెప్పినట్లు...సుదీర్గ విచారణ జరిపిన తరువాతే సచివాలయం కూల్చివేతకు అనుమతించింది. కనుకనే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా కూల్చివేతపనులు మొదలుపెట్టింది. కనుక ఈ దశలో హైకోర్టు కూల్చివేతను నిలిపివేయిస్తుందనుకోవడం అత్యాశే. హైకోర్టుకు ఆ ఉద్దేశ్యం లేదు కనుకనే కూల్చివేతలు పూర్తయిన తరువాత ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని చెప్పిందనుకోవాలి. అప్పుడు విచారణ చేపట్టినా హైకోర్టు ఏమి చెపుతుందో తేలికగానే ఊహించుకోవచ్చు. 


Related Post