నీమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

July 04, 2020


img

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ తయారుచేసిన ‘కోవాక్సిన్’ అనే కరోనా వ్యాక్సిన్ ఏవిధంగా పనిచేస్తోందో తెలుసుకొనేందుకు క్లినికల్ ట్రయల్స్ (మనుషులపై ప్రయోగించడం) త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటికోసం ఐసీఎంఆర్‌ దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపిక చేసింది. వాటిలో హైదరాబాద్‌లోని నీమ్స్ ఆసుపత్రి కూడా ఒకటి. నీమ్స్ ఆసుపత్రికున్న అపారమైన అనుభవం, అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల కారణంగా క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం నీమ్స్ ఆసుపత్రిని ఎంపిక చేశారని డైరెక్టర్ మనోహర్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ రెండు దశలలో జరుగుతాయని చెప్పారు. మొదటిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయ్యేందుకు 28 రోజులు సమయం పడుతుందని తెలిపారు. 

ఆగస్ట్ 15వ తేదీకి కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇటువంటి పరీక్షలలో నాణ్యత, ప్రామాణికతలకే ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప నిర్ధిష్ట గడువులోగా పూర్తిచేయాలని డెడ్‌లైన్‌ విధించడం సరికాదని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గడువులోగా వ్యాక్సిన్ అందజేయాలనే ప్రయత్నంలో క్లినికల్‌ ట్రయల్స్‌లో  ‘షార్ట్ కట్స్’ అనుసరిస్తే అది పెను విపత్తుకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్ధిష్టమైన ప్రమాణాలకు అనుగుణంగా గడువులోగా పూర్తిచేసి కరోనా టీకాను సిద్దం చేయగలిగితే చాలా అభినందనీయమే.


Related Post