కరోనా రికవరీ రేటు పెరిగింది: కేంద్రం

June 27, 2020


img

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటినప్పటికీ కోలుకొనేవారి సంఖ్య కూడా భారీగా పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. సుమారు పది రోజుల క్రితం 51-52 శాతం ఉన్న రికవరీ రేటు ఇప్పుడు 58 శాతంకు పెరిగిందని తెలిపారు. దీంతో ప్రతీరోజు ఆసుపత్రుల నుంచి భారీ సంఖ్యలో డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. అలాగే కేసులు రెట్టింపు అయ్యే సమయం కూడా క్రమంగా పెరుగుతోందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం 10-12 రోజులకు కేసులు రెట్టింపు అవుతుండగా ఇప్పుడు 19 రోజులు పడుతోందన్నారు. 

దేశంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి నేటి వరకు 2,95,881 మంది కోలుకోగా 15,685 మంది కరోనాకు బలయ్యారని కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. నేటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 79,96,707 రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు జరిపామని తెలిపారు. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 2,20,479 మందికి కరోనా పరీక్షలు జరుపగా 18, 552 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ఇప్పుడు కరోనా చికిత్స మందులు కూడా అందుబాటులోకి వచ్చినందున రికవరీ రేటు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. అలాగే కరోనా మరణాలు కూడా గణనీయంగా తగ్గవచ్చు. వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతర కృషి వలననే ఇన్ని లక్షల మంది కోలుకొని క్షేమంగా తిరిగి ఇళ్ళకు వెళ్ళగలుగుతున్నారని చెప్పవచ్చు. 

అయితే నేటికీ చాలా మంది ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా బయట ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నందునే ప్రతీరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయని చెప్పక తప్పదు. దీని వలన వారు, వారు కుటుంబాలు ఆర్ధికంగా, మానసికంగా చితికిపోవడమే కాకుండా కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై కూడా ఒత్తిరి పెంచినవారవుతున్నారు. కనుక దేశప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించినట్లయితే అతి త్వరలోనే భారత్‌ కరోనా నుంచి విముక్తి పొందగలదు. 


Related Post