జీహెచ్‌ఎంసీలో బుదవారం 108 కేసులు నమోదు

June 04, 2020


img

జీహెచ్‌ఎంసీలో అంతకంతకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటలలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొత్తగా 108 పాజిటివ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలో చెరో 6 కేసులు, మేడ్చల్, సిరిసిల్లా జిల్లాలో చెరో 2 కేసులు, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుదవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇవి కాక ఇద్దరు వలస కార్మికులకు కరోనా సోకినట్లు తెలిపింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివచ్చినవారిలో 448 మందికి కరోనా సోకినట్లు తెలియజేసింది. 

బుదవారం నమోదైన 127 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,020కి చేరింది. వారిలో 1,365 మంది ప్రస్తుతం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,556 మంది కరోనా నుంచి కోలుకొన్నారు. 99 మంది కరోనాతో మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది.  

తాజాగా సిరిసిల్లా, ఆసిఫాబాద్‌, యాదాద్రి, కామారెడ్డి జిల్లాలలో కూడా కరోనా కేసులు బయటపడటంతో రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,గద్వాల్ జిల్లాలు మాత్రమే కరోనారహిత జిల్లాలుగా నిలిచాయి.


Related Post