జూన్ 30వరకు లాక్‌డౌన్‌ కానీ...

May 30, 2020


img

ఈనెల 31వ తేదీతో లాక్‌డౌన్‌-4 ముగుస్తుంది కనుక లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఈరోజు సాయంత్రం కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈసారి కేవలం కంటెయిన్మెంట్ జోన్లలో మాత్రమే జూన్ 30వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ఆంక్షలు, నిబందనలు అన్ని యధాతధంగా కొనసాగుతాయని తెలిపింది. రాత్రిపూట కర్ఫ్యూ సమయాన్ని కూడా తగ్గించింది. ఇక నుంచి రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపింది.  

జూన్ 8వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలలో అన్ని మతాలకు చెందిన ప్రార్ధనామందిరాలను తెరుచుకోవచ్చునని తెలిపింది. అదే రోజు నుంచి షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు తెరుచుకొనేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. 

రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి జూలై నెలలో స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, ఇతర విద్యాసంస్థలు తెరిచేందుకు అనుమతిస్తామని తెలిపింది. అంతర్ రాష్ట్ర రవాణాపై ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. కానీ రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే ప్రజారవాణా (బస్సులు వగైరా) నడిపించుకోవలసి ఉంటుందని తెలిపింది.    

శ్రామిక్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు, దేశీయ విమాన సేవలు, విదేశాలలో చిక్కుకొన్న భారతీయులను వెనక్కు తీసుకురావడం వంటివన్నీ యధాతధంగా కొనసాగుతాయని తెలిపింది. 

సినిమాహాల్స్, స్విమ్మింగ్ ఫూల్స్, వ్యాయామశాలలు, పార్కులు, బార్లపై నిషేదం కొనసాగుతుంది. సామాజిక, రాజకీయ సమావేశాలు, సభలు, క్రీడా కార్యక్రమాలపై కూడా నిషేదం కొనసాగుతుంది. అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైల్‌ సేవలు ఎప్పుడు ప్రారంభించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. 

 లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినప్పటికీ ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కూలు ధరించాలని తెలిపింది. కార్యాలయాలు, మార్కెట్లు, హోటల్స్, షాపింగ్ మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో అందరూ భౌతికదూరం... కరోనా జాగ్రత్తలన్నీ పాటించడం తప్పనిసరి అని చెప్పింది. 


Related Post