భారత్‌లో కరోనా ఎక్కడ ఆగుతుంది?

May 30, 2020


img

కరోనా గురించి తెలియగానే భారత్‌లో వెంటనే లాక్‌డౌన్‌ ప్రకటించడంతో చాలరోజుల వరకు కరోనా అదుపులోనే ఉంది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిస్తున్నకొద్దీ దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరగసాగాయి. రెండు వారాల క్రితం వరకు రోజుకు 3,000 కేసులు వరకు నమోదవుతుండేవి. కానీ ఇప్పుడు రోజుకు 7,000 కంటే ఎక్కువ నమోదవుతున్నాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 7,964 కేసులు నమోదయ్యాయి. అంటే సుమారు 8,000 కేసులన్న మాట! 

రోజుకు 7-8,000 కేసులు నమోదవుతున్నట్లయితే, వారానికి 50,000 నెల తిరిగేసరికి 2 లక్షల కేసులు చొప్పున పెరిగిపోతుంటాయి. శనివారంనాటికి భారత్‌లో 1,73,763 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే ఇదే వేగంతో కేసులు పెరుగుతూపోతే వచ్చే నెల ఇదే సమయానికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుకోవచ్చు. 

కరోనా గురించి తెలిసిన కొత్తలో 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ఎటువంటి అవాంచనీయ పరిణామాలు జరుగుతాయని అందరూ భయపడ్డారో, ఇప్పుడు కరోనా కేసుల వేగాన్ని తగ్గించకపోతే రానున్న రోజులలో అదే జరుగవచ్చు. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై పోరాటాన్ని మరింత ఉదృతంగా చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, న్యూఢిల్లీ, చెన్నై, ఇండోర్ తదితర రాష్ట్రాలు, నగరాలకు ప్రత్యేక వ్యూహాలు లేదా ఏర్పాట్లతో కట్టడి చేయవలసి ఉంటుంది. 

కేవలం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలే కరోనా మహమ్మారిని కట్టడి చేయలేవు కనుక దేశప్రజలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పనిచేసుకోవడం నేర్చుకోవలసిన అవసరం చాలా ఉంది. 

కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన తాజా హెల్త్ బులెటిన్‌ ప్రకారం, భారత్‌లో కరోనా పరిస్థితి ఈవిధంగా ఉంది: 

గత 24 గంటలలో నమోదైన కొత్త కేసులు: 7,964

గత 24 గంటలలో మరణించిన వారి సంఖ్య: 265 

గత 24 గంటలలో కోలుకొని ఇళ్లకు వెళ్ళినవారి సంఖ్య: 11,264 

దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య: 1,73, 763 

ప్రస్తుతం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య: 86,442       

దేశంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య:4,971. 


Related Post