ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

May 29, 2020


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి వరుసగా షాకులు ఇస్తున్న ఏపీ హైకోర్టు ఈరోజు మరో పెద్ద షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను పదవిలో నుంచి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని, ఆయనను తొలగిస్తూ ఆర్టికల్ 213 ప్రకారం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లదని పేర్కొంది. కనుక తక్షణం నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను పదవిలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రెండు నెలల క్రితం ఏపీలో మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత దేశంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించి సర్వత్రా వ్యాపిస్తుండటంతో తనకున్న విచక్షణాధికారాలతో ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. అంతేగాక అధికార వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఎన్నికలలో తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపాలని ప్రయత్నిస్తున్న కారణంగా వైసీపీ నేతలు తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని, వారి వలన తమకు ప్రాణహాని ఉంది కనుక తనకు, తన కుటుంబానికి కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు ఆయన ఒక లేఖ కూడా వ్రాసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఏపీలో ఎక్కడ ఉన్నా తనకు, తన కుటుంబానికి రక్షణ ఉండదని చెప్పి కుటుంబంతో సహా హైదరాబాద్‌కు తరలివెళ్లిపోయారు. దీంతో ఆయనపై ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే ఆయనను ఆ పదవిలో నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి, చెన్నై నుంచి రిటైర్డ్ జడ్జి కనకారాజ్‌ను రప్పించి ఆ పదవిని కట్టబెట్టారు. 

దీంతో తనను పదవిలో నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఆయనను మళ్ళీ విధులలోకి తీసుకోవాలని ఆదేశించడంతో ఏపీ ప్రభుత్వానికి, హడావుడిగా వచ్చి ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ జడ్జి కనకారాజ్‌కు కూడా తీవ్ర అవమానకర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తోంది.           



Related Post