టిఎస్ ఆర్టీసీ ఎప్పటికైనా కోలుకోగలదా?

May 28, 2020


img

తెలంగాణలో నేటి నుంచి గతంలో మాదిరిగానే రాత్రి కూడా బస్సులు నడుస్తాయి. అలాగే ఇకపై ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులను నేటి నుంచి జేబీఎస్‌తో పాటు ఇమ్లీబన్‌ బస్టాండుకు కూడా అనుమతిస్తారు. సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన నిన్న ప్రగతి భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షాసమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. అయితే మరికొంతకాలం అంతరాష్ట్ర సర్వీసులను, నగరంలో సిటీ బస్సులను నడుపకూడదని నిర్ణయించారు. వేసవి ఎండల కారణంగా ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రాకపోవడం, బస్సులలో భౌతిక దూరం పాటించవలసి రావడం వలన ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నప్పటికీ ఆదాయం మాత్రం పెరగలేదు. గతంలో రోజుకు రూ.11-12 కోట్లు ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు రోజుకు రూ.2 కోట్లు ఆదాయం రావడం కూడా చాలా కష్టమవుతోంది. కనుక నేటి నుంచి అర్ధరాత్రి వరకు కర్ఫ్యూ  సమయంలో కూడా ఆర్టీసీ బస్సులను తిప్పాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. కర్ఫ్యూ సమయంలో గమ్య స్థానాలలో దిగినవారు ఇళ్లకు చేరుకొనేందుకు వీలుగా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆటోలు, టాక్సీలను అనుమతించాలని నిర్ణయించారు. బస్ టికెట్ ఉన్నవారిని దారిలో పోలీసులు అడ్డుకోరాదని సిఎం కేసీఆర్‌ సూచించారు. 

ఆర్టీసీ మొదటి నుంచి నష్టాలలోనే నడుస్తున్న సంగతి తెలిసిందే. 55 రోజుల ఆర్టీసీ సమ్మెతో ఇంకా నష్టాలలో కూరుకుపోయినప్పుడు, సిఎం కేసీఆర్‌ స్వయంగా పూనుకొని దానిని గాడిన పెట్టేందుకు అనేక చర్యలు తీసుకొని అమలుచేయిస్తున్నారు. కానీ కరోనా ప్రవేశంతో మార్చి 24 నుంచి అన్ని బస్సులు డిపోలలోనే ఉండిపోక తప్పలేదు. దాంతో ఆర్టీసీకి మరింత నష్టం వచ్చింది. ఆ నష్టాల నుంచి బయటపడేందుకు బస్సులను తిప్పడం ప్రారంభించినా కరోనా నేపధ్యంలో బస్సులలో కూడా భౌతికదూరం పాటించవలసి వస్తుండటంతో ఆర్టీసీ ఆదాయం దారుణంగా పడిపోయింది. కరోనా సమస్య ఇప్పట్లో తీరేది కాదు కనుక ఇక ఆర్టీసీని ఆ భగవంతుడే కాపాడాలేమో?


Related Post