మే 29న కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభం

May 27, 2020


img

మెదక్ జిల్లాలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ జలాశయంలోకి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు నీళ్లు నింపడం ప్రారంభిస్తారు. ముందుగా శ్రీ త్రిదండి చిన జియ్యర్ స్వామివారి అధ్వర్యంలో కొండపోచమ్మ ఆలయంలో యాగం చేస్తారు. సిఎం కేసీఆర్‌ కూడా ఈ యాగంలో పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం ఉదయం 11.30 గంటలకు జిల్లాలో మర్కుక్ మండల కేంద్రంలో నిర్మించిన పంప్‌హౌస్‌లో మోటర్లను ఆన్‌ చేసి కొండపోచమ్మ సాగర్‌ జలాశయంలోకి నీళ్ళు విడుదల చేస్తారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ మొదటిది కాగా ఇది చిట్టచివరి జలాశయం. సముద్రమట్టానికి 88 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి, రామడుగు, మిడ్‌మానేరు, అనంతగిరి, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్‌ల ద్వారా అంచెలంచెలుగా నీటిని ఎత్తిపోసుకొంటూ సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌ జలాశయంలోకి నీటిని తీసుకువచ్చారు. అంటే మొత్తం 530 మీటర్లు (1,739 అడుగులు) ఎత్తుకి నీటిని ఎత్తిపోసినట్లయింది. ఈ భగీరధ ప్రయత్నం విజయవంతం అవడంతో తెలంగాణలో పలుజిల్లాలలో కాలువలు, చెరువులు నీళ్ళతో కళకళలాడుతున్నాయి. ఆయా జిల్లాలలో భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరిగాయి. 

రూ.3,030 కోట్లు వ్యయంతో సుమారు 4,600 ఎకరాల విస్తీర్ణంలో 15 టీఎంసీల సామార్ద్యంతో కొండపోచమ్మ సాగర్‌ను నిర్మించారు. దీని నుంచి జిల్లాలకు నీటిని తరలించేందుకు 8 బారీ కాలువలు నిర్మించారు. వాటి ద్వారా గ్రావిటీ పద్దతిలో ఉమ్మడి మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీరు పారుతుంది. అలాగే సిద్ధిపేట జిల్లాలోని 1,721 చెరువులను నింపనున్నారు. జిల్లాలో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు సాగు, త్రాగునీరు అందుతుంది. కొండపోచమ్మ సాగర్‌ నుంచి విడుదలయ్యే నీటితో మేడ్చల్-మల్కాజ్‌గిరి, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డిజిల్లాలలో సుమారు 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆ జిల్లాలో త్రాగునీటి కష్టాలు కూడా తీరిపోనున్నాయి. భవిష్యత్‌లో దీని నుంచే హైదరాబాద్‌కు కూడా త్రాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.



Related Post