తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

May 26, 2020


img

కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ ఇచ్చిన వివరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలలో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుంటే తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని నిలదీసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఐసీఎంఆర్ నిబంధనలు పాటిస్తున్నట్లయితే జనాభాకు తగ్గట్లుగా పరీక్షలు జరిపించాలి కదా కానీ ఎందుకు అరకొర పరీక్షలతో సరిపెడుతోందని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై కేంద్రప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు వ్రాసింది కదా?దానికి సంబందించిన వివరాలు కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 

అసలు ఏ లెక్కన రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరుపుతున్నారో చెప్పాలని నిలదీసింది. అమెరికా వంటి అగ్రరాజ్యం కరోనాను నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పుడు భారీగా మూల్యం చెల్లిస్తోందని, తెలంగాణలో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తపడమని న్యాయస్థానం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇప్పటి వరకు వలస కార్మికులలో ఎంతమందికి పరీక్షలు నిర్వహించారో, అదేవిధంగా ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులలో ఎంతమందికి పరీక్షలు నిర్వహించారో లెక్కలు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. 

కరోనా పరీక్షలు జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రతిపక్షాలు మొదటి నుంచి నిలదీస్తూనే ఉన్నాయి. కేంద్రప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తేలికగా కొట్టిపడేసి ఎదురుదాడి చేస్తోంది తప్ప కరోనా పరీక్షల విషయంలో వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం చెప్పడంలేదు. ఇప్పుడు హైకోర్టు కూడా ఇదే విషయమై నిలదీసింది. తదుపరి విచారణలో హైకోర్టు ఏమి సమాధానం చెపుతుందో చూడాలి.


Related Post