వలస కార్మికులతో పెరుగుతున్న కేసులు

May 26, 2020


img

ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి తెలంగాణకు తిరిగివస్తున్నవారితో రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజే 15 మంది వలస కార్మికులకు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన 18 మందికి కరోనా సోకింది. ప్రతీరోజు ఇతర రాష్ట్రాల నుంచి వందలాది మంది  వలస కార్మికులు తెలంగాణకు చేరుకొంటూనే ఉన్నారు కనుక ప్రతీరోజు కొత్తగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.    

తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 66 కేసులు నమోదయ్యాయి. వాటిలో జీహెచ్‌ఎంసీలో 31, రంగారెడ్డిలో ఒకటి నమోదు కాగా, 15 మంది వలస కార్మికులకు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన 18 మందికి, ఓ మహారాష్ట్ర వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,920కి చేరింది.  

సోమవారం 72 మందిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేయడంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొన్నవారి సంఖ్య 1,164కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 700 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 56 మంది కరోనాతో మృతి చెందారు.  

రాష్ట్రంలో యాదాద్రి, వనపర్తి, వరంగల్‌ రూరల్ మూడు జిల్లాలు మొదటి నుంచి కరోనా రహితంగా నిలుస్తుండగా, మరో 25 జిల్లాలలో గత రెండు వారాల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం చాలా ఊరటనిచ్చే విషయంగానే చెప్పుకోవచ్చు. 


Related Post