ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

May 22, 2020


img
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఊహించని షాక్ ఇచ్చింది. సంచలనం సృష్టించిన డాక్టర్. సుధాకర్ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. కనుక ప్రభుత్వం అధీనంలో పనిచేస్తున్న సిఐడి పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపలేరని భావించిన హైకోర్టు డాక్టర్. సుధాకర్ కేసును సిబిఐకి అప్పగిస్తూ రెండు నెలలోగా విచారణ పూర్తిచేసి నివేదిక అందజేయాలని ఆదేశించింది.   

డాక్టర్ సుధాకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఎనస్తీషియన్‌ (ఆపరేషన్ సమయంలో రోగులకు మత్తుమందు ఇచ్చే వైద్యుడు) గా పని చేస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యులకు సిబ్బందికి మాస్కూలు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అంతకు ముందు ఆయన టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని కలిసివచ్చారని, ఆయన ప్రోత్సాహంతోనే డాక్టర్ సుధాకర్ ఇటువంటి చవుకబారు విమర్శలు చేసి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారని ప్రభుత్వ వాదన. గత శనివారం ఆయన మద్యం మత్తులో చొక్కా తీసేసి అర్ధనగ్నంగా హడావుడి చేయడంతో పోలీసులు అడ్డుకొన్నారు. ఆ సందర్భంగా ఆయన వారిపై దాడి చేయడంతో పోలీసులు ఆయనను లాఠీలతో కొట్టి, చేతులను వెనక్కు కత్తి నడిరోడ్డుపై పడుకోబెట్టారు. ఆ తరువాత విశాఖలో కేజీహెచ్‌కు తీసుకువెళ్లగా అక్కడి వైద్యుల సిఫార్సు మేరకు ఆయనను మెంటల్ హాస్పిటల్లో చేర్చారు. 

డాక్టర్ సుధాకర్ మానసిక సంతులన కోల్పోయి మద్యం త్రాగి పోలీసులపై దాడి చేస్తే అతనిని అరెస్ట్ చేయడం తప్పు కాదు. ఒకవేళ ఆసుపత్రిలో అవి కావలసినన్ని ఉండి ఉంటే శాఖాపరంగా ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకొంటే సరిపోయేది. ఒకవేళ ఆయన ఆరోపించినట్లు ప్రభుత్వాసుపత్రిలో మాస్కూలు, పీపీఈ కిట్లు లేనట్లయితే వాటిని ఏర్పాటు చేస్తే సరిపోయేది. కానీ చిరకాలంగా ప్రజలకు సేవలందిస్తున్న అటువంటి ఓ వైద్య నిపుణుడుని ఓ హంతకుడు లేదా ఉగ్రవాదిని బందించినట్లు బందించి భగభగమండే ఎండల్లో నడిరోడ్డుపై పడుకోబెట్టడం, లాఠీలతో కొట్టడాన్ని ఎవరూ సమర్ధించలేరు. వైసీపీ. టిడిపి రాజకీయాలకు ఆయనను బలి చేయవలసిన అవసరం అంతకంటే లేదు. డాక్టర్ సుధాకర్ కేసులో ఒకవేళ సిబిఐ ఏపీ పోలీసులను, ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తే వారికే అప్రదిష్ట కదా?


Related Post