రోహిణీ కార్తె వచ్చేసింది... తస్మాత్ జాగ్రత్త!

May 21, 2020


img

వేసవి కాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు వీచే ‘రోహిణీ కార్తె’ వచ్చేసింది. ఈ నెల 25 నుంచి రోహిణీ కార్తె మొదలవుతుంది కానీ అంతకంటే చాలా ముందే రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వడగాడ్పులు కూడా వీస్తున్నాయి. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కనుక ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ళలో నుంచి బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్లవలసివస్తే గొడుగు వేసుకొని లేదా తలకు, మొహాన్ని పూర్తిగా కప్పేలా గుడ్డ చుట్టుకొని, నీళ్ళ బాటిల్ వెంటపెట్టుకొని వెళ్ళడం మంచిది. వృద్ధులు, చిన్న పిల్లలు బయటకు వెళితే కరోనాతో పాటు వడదెబ్బ కూడా తగిలే ప్రమాదం ఉంటుంది కనుక ఇళ్ళలోనే ఉండటం మంచిది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో నీరు, లవణాలు చెమట రూపంలో బయటకు వెళిపోతుంటాయి కనుక డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక తరచూ మంచినీళ్లు,      మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పళ్ళ రసాలు త్రాగడం మంచిది. వీలైనంతవరకు వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవడం కూడా అవసరమే. 

తాజా సమాచారం ప్రకారం నల్గొండ, జగిత్యాల, ఉమ్మడి వరంగల్‌, మిర్యాలగూడలో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. 

కరీంనగర్‌, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, పాల్వంచలో 42 డిగ్రీలు నమోదయ్యింది. 

హైదరాబాద్‌, ఆల్వాల్, కాప్రా, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌లో 40 డిగ్రీలు నమోదయ్యింది.


Related Post