ప్రపంచ ఆరోగ్య సంస్థకు ట్రంప్‌ ఘాటులేఖ

May 18, 2020


img

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రస్ ఆంథోనామ్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సోమవారం చాలా ఘాటు లేఖ వ్రాశారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ దాని డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రస్ ఆంథోనామ్‌ చైనా ఒత్తిళ్లకు తలొగ్గి కరోనా వైరస్‌ గురించి ప్రపంచదేశాలను హెచ్చరించకుండా లక్షలాదిమంది మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు. వూహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ వ్యాపించిన తరువాత అక్కడి నుంచి సుమారు 50 లక్షల మందిని ప్రపంచంలో వివిద దేశాలకు వెళ్ళేందుకు చైనా అనుమతించినప్పుడు టెడ్రస్ ఆంథోనామ్‌ దానిని సమర్ధించారే తప్ప అడ్డుకొనే ప్రయత్నం చేయలేదని  ట్రంప్‌ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సకాలంలో హెచ్చరించకపోవడం వలననే అన్ని దేశాలకు కరోనా పాకిపోయిందని, ఆ కారణంగానే నేడు ఇన్ని లక్షల మంది కరోనాతో చనిపోతున్నారని ట్రంప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో ప్రపంచదేశాలకు తీవ్రనష్టం కలుగుతున్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ దాని డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రస్ ఆంథోనామ్‌ కరోనా కట్టడికి ప్రయత్నించకుండా, చైనాకు భజన చేస్తూనే ఉన్నారు తప్ప ఏనాడూ చైనాను గట్టిగా నిలదీసి అడగలేదని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బాధ్యతను విస్మరించిన చైనాకు జేబు సంస్థగా మారిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా ప్రజల కష్టార్జితాన్ని ధారపోయవలసిన అవసరం లేదని అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. నెలరోజులలోగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చురుకుగా స్పందించకపోతే, తాత్కాలికంగా నిలిపివేసిన నిధులను శాస్వితంగా నిలిపివేస్తానని డోనాల్డ్ ట్రంప్‌ హెచ్చరించారు. 



Related Post