ట్రంప్‌ వల్లే ఈ దుస్థితి... ఓబామా ఓ అసమర్దుడు

May 18, 2020


img

అమెరికాలో కరోనా సోకినవారి సంఖ్య 15, 16, 343కి చేరుకోగా, నేటి వరకు 89,932 మంది కరోనాతో చనిపోయారు. ఈ సంఖ్యలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో అమెరికన్లు, ఆ దేశంలో స్థిరపడినవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమెరికా చరిత్రలో అత్యంత దయనీయమైన పరిస్థితులుగా వీటిని చెప్పుకోవచ్చు. రోజుకు వేలకువేలు కొత్త పాజిటివ్ కేసులు పుట్టుకొస్తుంటే మరోపక్క ప్రతీరోజు వందల సంఖ్యలో అమెరికన్లు చనిపోతూనే ఉన్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చీమకుట్టినట్లు లేదని, నవంబర్ 14న జరుగబోయే అధ్యక్ష ఎన్నికలపై చూపుతున్న శ్రద్ద కరోనాను కట్టడి చేయడంపై చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో నానాటికీ పెరుగుతున్న కేసులు, మృతుల సంఖ్యే డోనాల్డ్ ట్రంప్‌ అసమర్ధతకు నిదర్శనమనే అభిప్రాయాలు కూడా వినబడుతున్నాయి. 

మీడియాకు దూరంగా ఉంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా ట్రంప్‌ తీరును తప్పు పడుతూ  విమర్శలు గుప్పించారు.  

 ఇటీవల ఓ యూనివర్సిటీ ఆన్‌లైన్‌ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా, “కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో అమెరికా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ మహమ్మారి అమెరికన్ల జీవితాలను నాశనం చేసేస్తోంది. పరిస్థితి తలక్రిందులయింది. దేశంలో ఇంత సంక్షోభం నెలకొన్నప్పటికీ బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నవారు కనీసం తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు కూడా నటించడంలేదు. ఈ విపత్కర పరిస్థితులలో దేశంలో నల్లజాతీయులపై దాడులు జరుగుతుండటం ఇంకా బాధాకరం,” అని అన్నారు. 

ఒబామా చేసిన ఈ వ్యాఖ్యలపై డోనాల్డ్ ట్రంప్‌ వెంటనే తీవ్రంగా స్పందించారు. “ఒబామా ఒక అసమర్ధ అధ్యక్షుడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను,” అని అన్నారు. 

అయితే ఒబామా అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఉపద్రవం రాలేదు కనుక ఆయన తన సమర్దతను నిరూపించుకొనే అవకాశం లభించలేదనే చెప్పవచ్చు. కానీ తానను తాను గొప్ప మేధావిగా భావించే డోనాల్డ్ ట్రంప్‌కు తన సమర్ధతను నిరూపించుకొనే అవకాశం ఇప్పుడు వచ్చింది. కానీ నిరూపించుకోలేక చైనాపై నిప్పులు కక్కుతూ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సంక్షోభ సమయంలో కూడా అమెరికాలో స్థిరపడిన ప్రవాసభారతీయ ఓటర్లను ప్రసన్నం చేసుకొని వారి ఓట్లు పొందేందుకు పలు ప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ కరోనా సంక్షోభం నుంచి దేశాన్ని... ప్రజలను కాపాడగలిగి ఉండి ఉంటే ప్రజలందరూ డోనాల్డ్ ట్రంప్‌కు మళ్ళీ పట్టం కడతారు కదా?


Related Post