కరోనా తల్లికి బందనాలు విముక్తి!

April 08, 2020


img

కరోనా తల్లి...అంటే దానికి జన్మనిచ్చిన వూహాన్ నగరం. కరోనా నుంచి వూహన్ నగరం విముక్తి పొందడంతో నేటి నుంచి పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్‌ నుంచి విముక్తి లభించడంతో వూహన్‌లో ప్రజలందరూ జైలు నుంచి విడుదలైన ఖైదీలలాగా చాలా సంతోషంగా బయటకు వచ్చారు. 

వూహాన్ నగరంలో కరోనా కేసులు నమోదుకాగానే జనవరి 23న లాక్‌డౌన్‌ ప్రకటించింది. అప్పటి నుంచి నేటి వరకు ఏకధాటిగా 76 రోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగింది. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించడంతో వూహాన్ నగరంలో మళ్ళీ చాలా రోజుల తరువాత దుకాణాలు, హోటళ్ళు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, పార్కులు వగైరా అన్ని తెరుచుకొన్నాయి. మళ్ళీ చాలా రోజుల తరువాత అన్నీ తెరుచుకొని ప్రజలు బయటకు రావడంతో ఇన్నాళ్లుగా శ్మశానంలా కనిపించిన వూహాన్‌ జీవకళతో కళకళలాడుతోంది. అయితే నేటికీ ప్రజలందరూ మొహాలకు మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. కొందరు రెయిన్ కోట్ వంటి పొడవైన ప్లాస్టిక్ దుస్తులను పైన ధరించి వస్తున్నారు. వూహాన్లో అన్ని తిరిగి తెరుచుకొన్నప్పటికీ విద్యాసంస్థలు మాత్రం మరికొన్ని రోజులు తెరవకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.    

వారం రోజుల క్రితమే వూహాన్ నగరంలో ప్రజారవాణా (బస్) సర్వీసులు మొదలయ్యాయి. నేటి నుంచి మెట్రో రైళ్లు కూడా ప్రారంభం అవడంతో సుమారు 55,000 మందికి పైగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వూహాన్ నుంచి దేశంలో ఇతర ప్రాంతాలకు పౌరవిమానసేవలు కూడా ప్రారంభం అయ్యాయి. 

ప్రపంచానికి భయంకరమైన కరోనా వైరస్‌ను అంటించిన వూహాన్...చైనా..ఆ సమస్య నుంచి బయటపడి యధాప్రకారం ముందుకుసాగిపోతుంటే, చైనా దెబ్బకు అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్‌, భారత్‌తో సహా 205కు పైగా చిన్నా పెద్ద దేశాలు కరోనా మహమ్మారి కోరాలలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. నేటికీ దేశాలకు దేశాలే లాక్‌డౌన్‌లో మగ్గుతున్నప్పటికీ రోజురోజుకీ కరోనా కేసులు, మృతుల సంఖ్య శరవేగంతో పెరిగిపోతూనే ఉంది. పైగా లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచదేశాల ఆర్ధికవ్యవస్థలు ఛిన్నాభిన్నం అయిపోతున్నాయి. కోట్లాదిమంది ఉద్యోగాలు, ఉపాది కోల్పోతున్నారు. నిరుపేదల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చివరికి చైనా చేసిన ఈ ఘనకార్యానికి పక్షులు, జంతువులు కూడా తిండి దొరక్క ఆకలితో అలమటించి చనిపోతున్నాయి. 

కానీ ప్రపంచానికి తమ వలన ఇంత మహాపకారం జరిగిందనే బాధ, పశ్చాతాపం చైనా పాలకులలో ఏమాత్రం కనిపించకపోవడం చాలా దారుణం. 


Related Post