లాక్‌డౌన్‌ చేయలేక అమెరికా మూల్యం చెల్లిస్తోందా?

April 07, 2020


img

అమెరికాతో పోలిస్తే భారత్‌ ఆర్ధికవ్యవస్థ అంత గొప్పది కాదని అందరికీ తెలుసు. కరోనాపై తొలిదశ పోరాటంలోనే అమెరికా వైఫల్యం చెందితే భారత్‌ మాత్రం తొలి దశలో విజయం సాధించింది. కానీ దురదృష్టవశాత్తు డిల్లీ మర్కజ్ మతసమావేశాలతో జరుగబోయే అనర్ధాన్ని సకాలంలో గుర్తించడంలో కాస్త ఆలస్యం జరుగడంతో దేశంలో మళ్ళీ కరోనా వైరస్‌ విజృంభించింది. 

అయితే నేటికీ కరోనాను కట్టడి చేయలేక అగ్రరాజ్యం అమెరికా ఆపసోపాలు పడుతుంటే భారత్‌ మాత్రం ఈ రెండవ దశలో కూడా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా దేశ ఆర్ధిక వ్యవస్థను పణంగా పెట్టి మరీ కరోనా మహమ్మారితో గట్టిగా పోరాడుతోంది. 

నిజానికి భారత్‌ ఆర్ధిక సామర్ధ్యం లేదా ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ ప్రకటించడం అసంభవమని అందరూ భావించారు. కానీ ప్రపంచదేశాలన్నీ నివ్వెరపోయేలా 21 రోజులపాటు ఏప్రిల్ 14వరకు దేశమంతటా ఒకేసారి లాక్‌డౌన్‌ ప్రకటించి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలుచేస్తున్నాయి కూడా. ఆ ఒక్క కారణంతోనే భారత్‌లో నేటికీ కరోనా వైరస్‌ అదుపు తప్పలేదని చాలా దేశాలు ముక్తకంఠంతో చెపుతున్నాయి. 

మరి భారత్‌ కంటే ఆర్ధికంగా ఎంతో బలంగా ఉన్న అమెరికా కూడా ఈ ‘లాక్‌డౌన్‌ మంత్రం’తోనే కరోనా సమస్యను అధిగమించవచ్చు కదా? భారత్‌లో సాధ్యమైంది అమెరికాలో ఎందుకు కాదు? అనే సందేహాలు కలగడం సహజం. నిజమే! కానీ అమెరికాలో పూర్తిగా లాక్‌డౌన్‌ అమలుచేయకపోవడానికి అనేక కారణాలున్నాయి.

అన్నిటికంటే ప్రధానంగా అమెరికాలో ఫెడరల్ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది కనుక మన దేశంలోలాగ కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అక్కడ కొంచెం కష్టమే. కనుక ఆయా రాష్ట్రాలలో పరిస్థితులను బట్టి ఏ స్థాయిలో లాక్‌డౌన్‌ అమలుచేయాలనేది రాష్ట్రాలే నిర్ణయించుకొంటున్నాయి. నవంబరు 4వతేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. కనుక కరోనా తీవ్రత ఎంతగా ఉన్నప్పటికీ దేశ ఆర్ధిక వ్యవస్థను బలంగా ఉంచడం కూడా చాలా అవసరమని ట్రంప్  భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అమెరికా లాక్‌డౌన్‌ చేసుకొని ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైతే అది ప్రపంచదేశాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటువంటి ఇంకా అనేక ఇతర కారణాల చేత అమెరికాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించడంలేదని భావించవచ్చు. దేశమంతా సంపూర్ణ లాక్‌డౌన్‌ చేయనందున కరోనా వ్యాపించే ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది. బహుశః అందుకే అమెరికాలో నానాటికీ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు భావించవచ్చు. భారతీయ కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 8.00 గంటలకు అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 3,67, 920 చేరుకొంది. ఇప్పటివరకు మొత్తం 19,940 మంది కోలుకోగా 10,993 మంది కరోనాకు బలయ్యారు.       

కానీ గడిచిన నాలుగు వారాలతో పోలిస్తే, ఇప్పుడు అమెరికా ప్రభుత్వం కరోనాను ఎదుర్కొని కట్టడి చేయడానికి చాలా చురుకుగా చర్యలు చెప్పటింట్టింది కనుక త్వరలోనే అమెరికాలో కరోనా అదుపులోకి వస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Related Post