లాక్‌డౌన్‌ తర్వాత ఏం జరుగబోతోంది?

March 31, 2020


img

ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా లేదా? అనే ప్రశ్నకు దేశప్రజలందరూ ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పుకొంటునే కేంద్రప్రభుత్వం దీనిపై ఏమి నిర్ణయం తీసుకోబోతోంది?అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కేంద్రప్రభుత్వం పాక్షికంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులలో మరో రెండువారాలైనా లాక్‌డౌన్‌ కొనసాగించవలసిన అవసరం ఉందని సిఎం కేసీఆర్‌ నిన్న స్పష్టంగా చెప్పడమే కాకుండా ఆమేరకు ప్రధాని నరేంద్రమోడీకి నేరుగా విజ్ఞప్తి చేశారు కూడా. 

డిల్లీ మార్కజ్ సమావేశాల తరువాత దేశంలో మళ్ళీ శరవేగంగా కరోనా పాజిటివ్ కేసులు, మృతులు పెరుగుతుండటంతో వాటిని నియంత్రించడానికి లాక్‌డౌన్‌ పొడిగింపు అనివార్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, యూపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నందున ఆ రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ కొనసాగించక తప్పనిసరి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

కానీ ఇంకా ఇలాగే లాక్‌డౌన్‌ కొనసాగిస్తే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణకు కూడా నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది కనుక కరోనా ప్రభావం తక్కువగా ఉండే రాష్ట్రాలలో జిల్లాలో వ్యాపార సంస్థలను, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలను, పరిశ్రమలను తిరిగి నడిపించేందుకు గల అవకాశాలు, కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై కేంద్రప్రభుత్వం రాష్ట్రాలతో చర్చిస్తోంది. 

ఏప్రిల్ 14న లాక్‌డౌన్‌ గడువు ముగిసేనాటికి డిల్లీ మార్కజ్ సమావేశాల ద్వారా దేశంలో వ్యాపించిన కరోనా కేసులు పూర్తిగా నియంత్రణలోకి వచ్చి కొత్త కేసులు నమోదు కాకపోతే పాక్షికంగా లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశం ఉంటుంది. కానీ  పాక్షికంగా లాక్‌డౌన్‌ ఎత్తివేసినా దేశంలో మళ్ళీ కరోనా వ్యాపించకుండా నివారించడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే లాక్‌డౌన్‌ అమలులో ఉన్న ఈ సమయంలోనే దేశంలో 4,000 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక ఎత్తివేస్తే జనాలను నియంత్రించడం చాలా కష్టం. ఇప్పుడు 4,000 కేసులను చూసి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నప్పుడు, లాక్‌డౌన్‌ ఎత్తివేశాక ఒకవేళ 40,000 కేసులు నమోదు అయితే నియంత్రించగలవా? అనే సందేహం కలుగుతుంది. కనుక లాక్‌డౌన్‌ కొనసాగించడం, ఎత్తివేయడం రెండూ కష్టమే.

లాక్‌డౌన్‌లో ఉన్న మేఘాలయ రాష్ట్రంలో నేటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో ఏప్రిల్ 15నుంచి పాక్షికంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని మేఘాలయ ప్రభుత్వం నిర్ణయించినట్లు తాజా సమాచారం.


Related Post