అమెరికాలో 10,938 మంది మృతి

April 07, 2020


img

ఒకప్పుడు జపాన్‌పై అమెరికా అణుబాంబులు ప్రయోగిస్తే, ఇప్పుడు అమెరికాపై చైనా కరోనా బాంబు ప్రయోగించిందని చెప్పవచ్చు. కరోనా ధాటికి అగ్రరాజ్యం గజగజవణికిపోతోంది. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ శరవేగంగా పెరిగిపోతోంది. గూగుల్ సమాచారం ప్రకారం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,67,758కి చేరింది.  న్యూయార్క్‌ టైమ్స్ తాజా సమాచారం ప్రకారం మంగళవారం నాటికి అమెరికా వ్యాప్తంగా మొత్తం 10, 938 మంది కరోనాతో చనిపోయారు. ఒక్క న్యూయార్క్‌లోనే 4,758 మంది కరోనా మహమ్మారికి బలయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. సోమవారం ఒక్కరోజునే అమెరికాలో 594 మంది చనిపోయారు. 

మార్చి 9నాటికి అమెరికాలో 26 మంది కరోనాతో చనిపోగా, మార్చి 18 నాటికి 157 మంది చనిపోయారు. ఆ రోజు నుంచి ప్రతీనాలుగైదు రోజులకు అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య రెట్టింపు వేగంతో పెరిగిపోయాయి. ఉదాహరణకు మార్చి 21న 343 మంది, మార్చి 24న 731, మార్చి 27న: 1,649, మార్చి 31న 3,910, ఏప్రిల్ 4న 8,499, ఏప్రిల్ 7న 10,938 మంది  చనిపోయారు. 

అమెరికా చరిత్రలో ఇటువంటి విషాదకరమైన, భయానకమైన పరిస్థితులు వస్తాయని బహుశః ఎవరూ ఊహించి ఉండరు. అమెరికాలో కరోనా ఈ స్థాయిలో విజృంభించడానికి వైద్యులు, వివిద రంగాలకు చెందిన నిపుణులు అనేక కారణాలు చెపుతున్నారు. కరోనా తీవ్రతను పసిగట్టి నివారణ చర్యలు చేపట్టడంలో అలసత్వం ప్రదర్శించడం, దాని తీవ్రతను గుర్తించిన తరువాత కూడా అమెరికా అంతటా లాక్‌డౌన్‌ ప్రకటించలేకపోవడం, నేటికీ కొన్ని రాష్ట్రాలకు అంతర్జాతీయ పౌర విమానాలను అనుమతిస్తుండటం, శరవేగంగా పెరుగుతున్న కరోనా రోగులకు చికిత్స చేసేందుకు తగినన్ని ఆసుపత్రులు, వైద్యులు, వైద్య పరికరాలు ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం, తాత్కాలికంగా కరోనా వైరస్‌ను అదుపులో ఉంచగలుగుతున్న పారాసిటమాల్, హైడ్రాక్సిక్లోరోక్వీన్ వంటి చిన్న చిన్న మందుల కోసం భారత్‌ వంటి దేశాలవైపు చూడవలసిన దుస్థితి వంటి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

కారణాలు ఏవైనప్పటికీ ప్రస్తుతం అమెరికా ఒక భయానకమైన అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ పరీక్షలో అమెరికా తప్పకుండా విజయం సాధిస్తుందని అందరికీ తెలుసు కానీ ఇంకా ఎప్పుడు? అప్పటిలోగా ఇంకా ఎంతమందిని కరోనా బలి తీసుకొంటుంది?అనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులలో “గాడ్ బ్లస్ అమెరికా..” అమెరికా దేశభక్తి గీతాన్ని గుర్తుచేసుకోవలసిందే.


Related Post