కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయాలు

April 06, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఈరోజు కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయం కోల్పోతున్నందున ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనా మహమ్మారిని ఎదుర్కొని పోరాడేందుకు భారీగా నిధులు సమకూర్చుకోవలసి ఉంటుంది. కనుక ఈ ఏప్రిల్ నెల నుంచి ఏడాదిపాటు ప్రధాని నరేంద్రమోడీ మొదలు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరి జీతాలలో 30 శాతం కోత విధించి ఆ మొత్తాన్ని కరోనాపై పోరాటానికి వినియోగించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఎంపీలు, కేంద్రమంత్రులు అందరూ అంగీకరించినందున కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. 

అలాగే ఎంపీలు తమతమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకొనేందుకు ఇచ్చే ఎంపీ లాడ్ ఫండ్స్ ను కూడా ఈ ఏప్రిల్ నుంచి రెండేళ్ళపాటు నిలిపివేసి ఆ మొత్తాన్ని కూడా కరోనాపై పోరాటానికి వినియోగించాలని నిర్ణయించారు. ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా కేంద్రప్రభుత్వం చేతికి తక్షణం సుమారు రూ.7,900 కోట్లు వస్తాయని అంచనా. ఇంకా అభినందనీయమైన విషయమేమిటంటే.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు కూడా తమ జీతాలలో కోతకు స్వచ్ఛందంగా అంగీకరించారు. ఇప్పటికే దేశంలో ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, సామాన్యప్రజలు కూడా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహాయనిధికి యధాశక్తిన విరాళాలు ఇస్తూ మేము సైతం అంటూ కరోనాపై పోరాటంలో పాలు పంచుకొంటున్నారు. కనుక కరోనాపై భారత్‌ మొదలుపెట్టిన ఈ పోరాటంలో తప్పకుండా విజయం సాధించి త్వరలోనే కరోనా మహమ్మారిని నిర్మూలించగలమని ఆశిద్దాం. 


Related Post