మెదక్‌లో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా!

April 03, 2020


img

మెదక్ పట్టణంలో ఆజంపురకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్‌ సోకింది. వారి ఇంటి పెద్ద (56) ఇటీవల డిల్లీ నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొని మార్చి 21న మెదక్ తిరిగి వచ్చారు. ఆయనకు కరోనా లక్షణాలు కనబడటంతో వైద్య ఆరోగ్య సిబ్బంది ఆయనను సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులందరికీ వైద్య పరీక్షలు చేయించగా ఆయన భార్య, కుమార్తె, కోడలికి కూడా కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దాంతో వారు ముగ్గురినీ కూడా ప్రత్యేక అంబులెన్సులో ఈరోజు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కరోనా సోకిన వారు నలుగురితో పాటు వారి కుటుంబానికే చెందిన మరో 12 మందిని పాపన్నపేటలో హరితహోటల్లో ఏర్పాటు చేసిన  క్వారంటైన్‌ శిబిరానికి తరలించారు. మార్చి 21 నుంచి ఇప్పటివరకు వారు ఇంకా ఎవరెవరిని కలిశారో గుర్తించేందుకు జిల్లా వైద్యసిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 229కి చేరింది. ఈరోజు ఇద్దరు కరోనాతో మృతి చెందడంతో కరోనా మృతుల సంఖ్య 11కి చేరింది. 

ఏపీలో నేటివరకు 161 కేసులు నమోదు కాగా వాటిలో 140 కేసులు నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొన్నవారే. సోమవారం మధ్యాహ్నం విజయవాడలో ఒక వ్యక్తి (55) కరోనాతో మరణించాడు.  

తమిళనాడులో కూడా  ఇవాళ్ళ ఒక్కరోజే ఏకంగా 102 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 100 మంది నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొన్నవారేనని  ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్ తెలిపారు. 

దేశరాజధాని డిల్లీలో గత 24 గంటలలో 91 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో డిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 384కి చేరింది. వారిలో 259 మంది మత సమావేశాలలో పాల్గొన్నవారేనని డిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్‌ తెలిపారు. 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొన్నవారినందరినీ, వారు కలిసిన వారినందరినీ గుర్తించి, అందరినీ క్వారంటైన్‌లోకి పంపించేవరకు దేశంలో ఈ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఈ కరోనా మృత్యు ఘంటలు మ్రోగుతూనే ఉంటాయని చెప్పవచ్చు. కనుక అన్ని రాష్ట్రాలు మరింత చురుకుగా, నేర్పుగా వారిని గుర్తించవలసి ఉంటుంది.


Related Post