లాక్‌డౌన్‌తో ముందు నుయ్యి వెనుక గొయ్యి

March 30, 2020


img

కరోనా పీడ వదిలించుకోవాలంటే అందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నొక్కి చెపుతున్నాయి. లాక్‌డౌన్‌ వలన ఓ పక్క దేశ ఆర్ధిక పరిస్థితులు కుదేలు అవుతున్నప్పటికీ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకొనేందుకు లాక్‌డౌన్‌ అమలుచేయక తప్పడం లేదు. లాక్‌డౌన్‌ అమలుచేసినప్పటికీ దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఆగడం లేదు. కనుక రానున్న రోజులలో మరింత కటినంగా...మరిన్ని రోజులు లాక్‌డౌన్‌ అమలుచేయక తప్పదు. ఏప్రిల్ 14వరకు దేశమంతటా లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. దానిని ఏప్రిల్ నెలాఖరువరకు పొడిగించే అవకాశాలున్నాయి. 

కానీ లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కోట్లాదిమంది ఉద్యోగాలు, ఉపాది మార్గాలు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇక మన దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా రోజు కూలీలు, వలస కార్మికుల పరిస్థితులు ఇప్పటికే దయనీయంగా మారాయి. కనుక ఈ లాక్‌డౌన్‌ మరింత కాలం పొడిగిస్తే వారి పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది. కానీ లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే దేశంలో కరోనా అదుపు తప్పి కరోనా వైరస్ దేశాన్ని కబళించివేస్తుంది. కనుక లాక్‌డౌన్‌తో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసమయంలో ఓవైపు కరోనాతో.. మరోవైపు ఈ ఆర్ధిక సమస్యలతో పోరాడక తప్పడం లేదు. కానీ ఇంకా ఎంతకాలం భారత్‌ లాక్‌డౌన్‌ చేసుకొని కరోనాతో పోరాడగలదు? అనే ప్రశ్నకు సమాధానం లేదు.


Related Post