కరోనాతో గాడిన పడుతున్న ప్రకృతి!

March 26, 2020


img

కరోనా వైరస్‌ వలన కలిగే కష్టనష్టాల గురించే వింటున్నాము. తొలిసారిగా కొన్ని లాభాలు కూడా కనబడుతున్నాయి. ఒకప్పుడు డిల్లీలో వాయుకాలుష్యం తీవ్రమైనప్పుడు దానిని నియంత్రించేందుకు సరిబేసి సంఖ్యల విధానంలో వాహనాలను రోడ్లపైకి అనుమతించేవారు కానీ ఇప్పుడు ఒక్క డిల్లీయే కాదు యావత్ భారతదేశం... ఆ మాటకొస్తే యావత్ ప్రపంచం లాక్‌డౌన్‌ పాటిస్తుండటంతో కాలుష్యం వెదజల్లే వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా కార్మికులు బయటకు రావడంలేదు కనుక కాలుష్యాన్ని చిమ్మే పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా వాయు, శబ్ధ కాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. కాలుష్యం తగ్గడంతో మళ్ళీ ఓ జోన్ పొరకు ఏర్పడిన రంద్రము మెల్లగా పూడుకొంటోంది. వాతావరణం చక్కబడుతుండటంతో ఇదివరకు కనబడకుండా మాయమైపోయిన పిచ్చుకలు, పక్షులు మళ్ళీ కనిపిస్తున్నాయి.

గడపదాటి బయటకు కాలుపెట్టలేకపోవడంతో మళ్ళీ చాలా కాలం తరువాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి మెలిసి కబుర్లు చెప్పుకొంటున్నారు. ఆఫీసు పని ఒత్తిళ్ళు తగ్గడంతో మళ్ళీ భార్యభర్తలు హాయిగా కబుర్లు చెప్పుకొంటున్నారు. ఇంతకాలం ఒంటరితనం అనుభవిస్తూ భారంగా జీవిస్తున్న వృద్ధులైన తల్లితండ్రులు తమ పిల్లలు, మనుమలు కళ్ళ ముందు కదలాడుతుంటే చాలా సంతోషిస్తున్నారు. అంటే కరోనా వలన అటు ప్రకృతి, ఇటు సమాజం రెండూ కూడా మళ్ళీ గాడినపడుతున్నాయన్న మాట!

ఇదంతా బాగానే ఉన్నప్పటికీ మరోపక్క కరోనా విలయతాండవం చేసేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజూ వేలాది కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనాతో రోజూ వేలాదిమంది చనిపోతూనే ఉన్నారు. కనుక కరోనా కత్తికి రెండువైపులా పదునేనని చెప్పకతప్పదు.  


Related Post