ట్రంప్ బిజినెస్ $3 బిలియన్స్..కానీ భారత్‌కు ఏమి లాభం?

February 25, 2020


img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెండు రోజుల భారత్‌ పర్యటనలో భాగంగా ఇవాళ్ళ డిల్లీలో హైదరాబాద్‌ హౌసులో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. అనంతరం వారిరువురూ సంయుక్త ప్రకటన చేశారు. భారత్‌ పర్యటన విజయవంతమైందని ట్రంప్ చెప్పగా భారత్‌-అమెరికా బందం మరింత బలపడిందని మోడీ చెప్పారు. ఈరోజు జరిగిన సమావేశంలో భారత్‌తో మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు జరిగాయని ట్రంప్ చెప్పారు. అంటే అంత విలువైన అమెరికా ఉత్పత్తులను ట్రంప్ భారత్‌కు అమ్ముకోగలిగారన్నమాట. కనుక ఆయన పర్యటన విజయవంతం అయ్యిందనే చెప్పవచ్చు. 

కానీ భారత్‌ కోరుకొన్నట్లుగా ఇరుదేశాల మద్య వ్యాపార వాణిజ్య ఒప్పందాలు జరిగిన దాఖలాలు కనబడలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ట్రంప్ నోట పలికించడమే మోడీ సాధించిన విజయంగా సరిపెట్టుకోవాలేమో?అయితే దాని వలన భారత్‌కు కొత్తగా ఒరిగేదేమీ ఉండదని అందరికీ తెలుసు. మాదకద్రవ్యాలు, మానవ అక్రమరవాణాను అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ చేశామని ట్రంప్ చెప్పారు. అది కూడా అమెరికా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారంగానే కనిపిస్తోంది తప్ప దాని వలన భారత్‌కు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ట్రంప్-మోడీ సంయుక్త ప్రకటన సారాంశం విన్నప్పుడు ట్రంప్ పర్యటనతో భారత్‌కు ఎటువంటి లాభమూ కలుగలేదనిపిస్తుంది. అయితే ఇప్పుడే ఆవిధంగా అనుకోవడం తొందరపాటే అవుతుంది. కనుక దీనిపై కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసేవరకు వేచి చూడకతప్పదు.


Related Post