ఇంతకీ అమూల్య ఏమి చెప్పాలనుకొంది?

February 21, 2020


img

సీఏఏకు వ్యతిరేకిస్తూ ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్‌’ పేరుతో గురువారం బెంగళూరులో జరిగిన సభలో అమూల్య లియోన్ అనే ఓ యువతి ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసి గందరగోళం సృష్టించడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు 2 వారాలు నాన్ బెయిలబుల్ జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

స్థానిక కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఆ యువతి మొదటి నుంచి సీఏఏ ఆందోళనలలో చురుకుగా పాల్గొంటోంది. భారతీయులు తమ దేశాన్ని ఏవిధంగా ప్రేమిస్తారో అదేవిధంగా ప్రపంచంలో అన్ని దేశాలు, ముఖ్యంగా మన ఇరుగుపొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బర్మా దేశాలు కూడా పరస్పరం ప్రేమాభిమానాలతో మెలగాలని, గౌరవించుకోవాలని కోరుతూ ఆమె కన్నడలో ఓ కవిత వ్రాసి ఇటీవల ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. బహుశః ఇదే విషయం ఈ వేదికపై చెప్పాలనే ప్రయత్నంలో ఆమె మొదట ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ రెండు మూడుసార్లు  నినాదం చేయడంతో వేదికపై ఉన్నవారందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన వారు ఆమె చేతిలో నుంచి మైక్ లాకొంటున్నప్పుడు ఆమె ‘హిందూస్థాన్ జిందాబాద్’ అంటూ రెండుమూడుసార్లు నినాదాలు చేయడం గమనిస్తే, ఆమె తాను కవితలో వ్రాసినదే చెప్పాలనుకొంటోందని అర్ధమవుతోంది. 


కానీ పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదంతో ఆమె ప్రసంగం మొదలుపెట్టడంతో ఆమె భారత్‌కు వ్యతిరేకంగా... పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడుతోందనే భావన కలిగించింది. కనుక ఆమె చెప్పదలచుకొన్న విషయాన్ని తప్పుగా మొదలుపెట్టలేకపోవడం..సరిగ్గా చెప్పలేకపోవడం వలననే ఈ గందరగోళానికి కారణంగా కనిపిస్తోంది. 


పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించగా అక్కడ చిక్ మంగళూరులో ఆమె నివాసంపై బజారంగ్ దళ్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే వారు ఆమె ఇంటికి వెళ్ళి ఆమె తండ్రిని బయటకుతీసుకువచ్చి నీ కూతురు చేసింది తప్పా కాదా? ఆమెకు ఏమి జరగాలని కోరుకొంటున్నావు? దేశద్రోహి అయిన ఆమెను మళ్ళీ ఇంట్లో ఉంచుకొంటావా?జైల్లోనే ఉండమంటావా?అంటూ దాదాపు కొట్టినంత పనిచేసి విడిచిపెట్టారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఆ కవిత కింద పాకిస్థాన్‌ జిందాబాద్ అన్నందుకు ఆర్ఎస్ఎస్ గూండాలు తనపై దాడి చేయవచ్చని, పోలీసులు తనను అరెస్ట్ చేయవచ్చునని కూడా వ్రాసింది. చివరకు అదే జరగడం విశేషం.


Related Post