న్యాయవ్యవస్థపై కూడా నిర్భయ దోషుల అత్యాచారం?

February 20, 2020


img

నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో...ఆ కేసులో ఉరిశిక్షను తప్పించుకోవడానికి నలుగురు దోషులు వేస్తున్న రకరకాల ఎత్తులు కూడా అంతకంటే సంచలనం సృష్టిస్తున్నాయి. డిసెంబర్ 2012 నుంచి జైల్లో ఉంటున్నవారిలో ఏమాత్రం పశ్చాత్తాపం కలుగలేదు పైగా ఈ ఏడేళ్ళలో వారు చట్టంలో గల అవకాశాలను లేదా లోపాలను ఏవిధంగా ఉపయోగించుకోవచ్చో చక్కగా నేర్చుకున్నారు. దాంతో ఇన్నేళ్ళుగా ఈ కేసును సాగదీసిన వారు, జనవరిలో పటియాలా హౌస్ కోర్టు మొదటిసారి వారికి ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్స్ జారీ చేసినప్పటి నుంచి చిత్రవిచిత్రమైన ఎత్తుగడలతో రెండుసార్లు ఉరిశిక్షను వాయిదా వేయించగలిగారు. 

పటియాలా హౌస్ కోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతితో చెలగాటం ఆడుతూ సహనాన్ని పరీక్షిస్తున్నప్పటికీ, చట్టాలకు లోబడి పనిచేసే మన వ్యవస్థలు వారిని ఓపికగా భరిస్తున్నాయి. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురినీ ఒకేసారి ఉరి తీయలంటూ పటియాలా హౌస్ కోర్టు మళ్ళీ తాజాగా డెత్ వారెంట్స్ జారీ చేయడంతో నిర్భయ దోషుల డ్రామా  మొదలైపోయింది. 

వారిలో ఒకడైన వినయ్ కుమార్ శర్మ జైల్లో గోడకు తలబాదుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నిజానికి ఉరిశిక్ష పడబోయే వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకొంటాడు?అని ఆలోచిస్తే అది కూడా శిక్షను తప్పించుకోవడానికి ఆడుతున్న ఓ నాటకమని అర్ధమవుతుంది. 

ఉరిశిక్ష అమలుచేసే సమయానికి దోషులు పూర్తి ఆరోగ్యంతో ఉండాలి...ఎటువంటి ఆరోగ్యసమస్యలున్నా ఉరిశిక్ష అమలుచేయకూడదనే ఓ నిబందన ఉంది. కనుక ఉరిశిక్షను తప్పించుకొనేందుకే వినయ్ శర్మ తలను గోడకు కొట్టుకొని గాయపరుచుకుని అర్దమవుతోంది. కానీ అతను మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, కనుక అతనిని ఉరి తీయవద్దని అతని న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. కోర్టులు చట్టప్రకారమే వ్యవహరిస్తాయి కనుక వారి కుయుక్తులు అర్ధమవుతున్నా ఏమీ చేయలేని నిసహాయస్థితిలో తిరిగి దోషులకే న్యాయసహాయం అందించవలసి వస్తోంది.అతని విషయంలో చట్టప్రకారం వ్యవహరించాలని తీహార్‌ జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.   

డిల్లీ, పటియాలా హౌస్ కోర్టులో సోమవారం డెత్ వారెంట్స్ పై విచారణ జరుపుతున్నప్పుడు దోషులలో ఒకడైన ముఖేశ్‌కుమార్‌సింగ్‌ తన తరపున వాదిస్తున్న న్యాయవాది వృందా గ్రోవర్‌ను మార్చాలని కోర్టును కోరడంతో రవి ఖాజీ అనే న్యాయవాదిని ఏర్పాటు చేసింది. గత రెండు నెలలుగా సాగుతున్న వారి ఈ నాటకలన్నిటినీ చూస్తుంటే దోషులు నిర్భయనే కాదు...చివరికి మన న్యాయవ్యవస్థను కూడా సామూహిక అత్యాచారం చేస్తున్నట్లనిపిస్తోంది. మరి దీనికి ఏ శిక్ష విధించాలో మన న్యాయవ్యవస్తే ఆలోచించుకోవాలి. 


Related Post