అయోధ్య రామాలయ నిర్మాణంలో కొత్త ట్విస్ట్

February 19, 2020


img

సుమారు ఒక శతాబ్ధంకు పైగా కొనసాగిన అయోధ్య- బాబ్రీ మసీదు భూవివాదం ఎట్టకేలకు గత ఏడాది సుప్రీంకోర్టు పరిష్కరించింది. అయోధ్యలో ఆ వివాదాస్పద భూమిని హిందువులకే చెందుతుందని తీర్పు చెప్పి అప్పగించడంతో కేంద్రప్రభుత్వం ‘శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర’ అనేపేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికే రామాలయం నిర్మించే బాధ్యత అప్పగిస్తోంది. త్వరలోనే రామలయ నిర్మాణపనులు మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. కనుక ఇక రామలయ నిర్మాణానికి ఎటువంటి అవరోధాలు లేవని స్పష్టం అయ్యింది. 

కానీ స్థానిక ముస్లిం పెద్దలు ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ పరాశరన్‌కు వ్రాసిన ఓ లేఖలో అతిముఖ్యమైన విషయం ప్రస్తావించారు. రామాలయం నిర్మించబోతున్న ప్రదేశంలో 1885లో జ‌రిగిన అల్లర్లలో చనిపోయిన 75మంది ముస్లింల సమాధులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అంతకు ముందు బాబ్రీమసీదు ప్రాంతాన్ని కూడా ముస్లిం శ్మశానవాటికగా వినియోగించారని, అటువంటి ప్రదేశంలో ఆ సమాధుల మీద కోట్లాది హిందువుల ఆరాధ్యదేవుడైన శ్రీరాముడి పవిత్రమైన ఆలయాన్ని నిర్మించడం హిందూ సనాతన ధర్మాలకు విరుద్దంగా ఉందని వారు లేఖలో పేర్కొన్నారు. కనుక సుప్రీంకోర్టు ట్రస్టుకు అప్పగించిన 67 ఎకరాల భూమిని రామాలయానికి వాడుకోవడం మంచిదా కాదా అని ఆలోచించుకోవాలని వారు లేఖలో కోరారు. ఆ భూమిలో సమాధులున్న ప్రాంతాన్ని అలాగే విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. 

వారు లేవనెత్తిన ఈ అంశం న్యాయవివాదం కాదని అర్ధమవుతూనే ఉంది. సాధారణంగా హిందువులు ఇల్లు నిర్మించుకొనేందుకు ఎటువంటి దోషాలు లేని తగిన స్థలాన్ని ఎంచుకొంటారు. శ్మశానవాటికలకు వీలైనంత దూరంగా స్థలాలను ఎంపిక చేసుకొని ఇళ్ళు నిర్మించుకుంటారు. వాస్తును కూడా సరిచూసుకొని అన్నీ సవ్యంగా ఉంటేనే నిర్మాణానికి సిద్దపడతారు. ఒక ఇంటి నిర్మాణం విషయంలోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నప్పుడు, సమాధులు, శ్మశానవాటికపై పవిత్రమైన ఆలయం ఏవిధంగా నిర్మిస్తారు? అనే ముస్లిం ప్రతినిధుల ప్రశ్న ఆలోచించవలసిన విషయమే.


Related Post