మోడీ-కేసీఆర్‌ల మద్య యుద్ధం మొదలైందా?

February 18, 2020


img

రాష్ట్రానికి నిధులు కేటాయింపుపై సిఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ తదితరులు విమర్శలు గుప్పిస్తుండటం, సీఏఏకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసి, దేశంలోని ప్రాంతీయపార్టీలను కూడగట్టి ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి కేంద్రంతో పోరాడేందుకు సిఎం కేసీఆర్‌ మెల్లగా పావులు కదుపుతుండటంతో కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం (బిజెపి అధిష్టానం) కూడా సిద్దమవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్. 

కిషన్‌రెడ్డి నిత్యం తెలంగాణ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటారు. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ నిన్న హైదరాబాద్‌కు వచ్చినప్పుడు, “తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని, 15వ ఆర్ధికసంఘం సిఫార్సు మేరకు అన్ని రాష్ట్రాలకు నిధులు విడుదలచేస్తున్నామని,” ఘాటుగా సమాధానం చెప్పారు. 

ఇటువంటి వివాదాలకు దూరంగా ఉండే కేంద్ర రైల్వేమంత్రి పీయూష్ గోయల్, మంగళవారం  హైదరాబాద్‌ వచ్చినప్పుడు, కేసీఆర్‌, కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ విమర్శలకు చాలా ఘాటుగా జవాబు చెప్పారు. 

“పార్లమెంటు ఆమోదించిన సీఏఏను వ్యతిరేకిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానిస్తోంది. ఓవైసీల మెప్పుకోసమే సిఎం కేసీఆర్‌ సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. ఓవైసీలతో చేతులు కలిపి సీఏఏ పేరుతో రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా వారి మెప్పుకోసమే సిఎం కేసీఆర్‌ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. సిఎం కేసీఆర్‌ కేసీఆర్‌ కుమార్తె నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోవడం గమనిస్తే రాష్ట్రంలో బిజెపి బలపడుతోందని స్పష్టం అవుతోంది. కేంద్రం ఇస్తున్న నిధుల గురించి తెలుసుకోకుండా మంత్రి కేటీఆర్‌ అవగాహనాలోపంతో ఇష్టారీతిన కేంద్రంపై ఆరోపణలు చేయడం సరికాదు,” అని అన్నారు. 

దక్షిణాది రాష్ట్రాలపట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పీయూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. “యూపీఏ హయాంలో కేంద్రం తెలంగాణకు కేవలం రూ.258 కోట్లు మాత్రమే ఇస్తే, ఎన్డీయే హయాంలో ఒక్క 2020-21 ఆర్ధిక సంవత్సరంలోనే తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.2,602 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం భారీగా నిధులు అందిస్తున్నందునే పనులు చురుకుగా సాగుతున్నాయని తెలుసుకొంటే మంచిది. ఈవిధంగా అవగాహనారాహిత్యంతో మాట్లాడటం సరికాదు,” అని మంత్రి తలసానికి నేరుగానే పీయూష్ గోయల్ సమాధానం చెప్పారు.                            

ఇప్పటి వరకు కిషన్ రెడ్డి తప్ప కేంద్రమంత్రులెవరూ కేసీఆర్‌, కేటీఆర్‌లను ఉద్దేశ్యించి నేరుగా ఈవిధంగా ఇంత ఘాటుగా విమర్శలు చేయలేదు. కానీ ఇవాళ్ళ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేశారంటే సిఎం కేసీఆర్‌తో కత్తులు దూయడానికి కేంద్రం కూడా సై అంటున్నట్లే భావించవచ్చు. ఆయన చేసిన ఈ విమర్శలపై టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.


Related Post