తెలంగాణ పట్ల వివక్ష చూపడం లేదు: నిర్మల

February 17, 2020


img

తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఏటా సుమారు రూ.2 లక్షల కోట్లకు పైగా వెళుతున్నప్పటికీ, కేంద్రప్రభుత్వం దానిలో సగమైనా తిరిగి ఇవ్వడం లేదని, రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పలు సందర్భాలలో ఆరోపిస్తూనే ఉన్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని తప్పు పడుతూ మంత్రి కేటీఆర్‌ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ మంత్రులు చేస్తున్న ఈ ఆరోపణలు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి వెళ్ళడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. 

ఆదివారం హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణతో సహా దేశంలో ఏ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపడంలేదు. కేంద్రానికి ఆ అవసరం లేదు. ఓ రాష్ట్రాన్ని ఎక్కువగా మరో రాష్ట్రాన్ని తక్కువగా చూడటం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యతనే ఇస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. రాష్ట్రాలలో అమలవుతున్న కేంద్ర పధకాలలో ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించాలనేది వాటి జనాభా, పనితీరు ఆధారంగా  15వ ఆర్ధిక సంఘం నిర్ణయిస్తుంది. దాని సిఫార్సుల మేరకే తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాము,” అని అన్నారు.

రాష్ట్రాల సమస్యలు, అవసరాలు ఒకలాగ ఉంటే...అన్ని రాష్ట్రాలతో కూడిన దేశ సమస్యలు, అవసరాలు మరోలా ఉంటాయి. ఉదాహరణకు రాష్ట్రాలలో జిల్లాలలో పరిశ్రమలు, వ్యవసాయం, మౌలికావసతుల కల్పన వంటివి ప్రాధాన్యంగా ఉంటాయి. అదే జాతీయస్థాయిలో చూసినట్లయితే కేంద్రప్రభుత్వానికి దేశరక్షణ, విదేశీవ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పార్లమెంటు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కార్యాలయాలు, రైల్వేలు నిర్వహణ, వాటిలో పనిచేసే లక్షలాదిమందికి జీతభత్యాలు, పెన్షన్లు, దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం, ప్రాజెక్టులు, సంక్షేమపధకాల అమలు వంటి అనేకానేక బరువుబాధ్యతలు ఉంటాయి. కనుక రాష్ట్రాల నుంచి పన్నుల రూపేణా వచ్చిన ఆదాయంలో కొంత తప్పనిసరిగా వాటి కోసం కేటాయించవలసి వస్తుంది. మిగిలిన దానినే రాష్ట్రాలకు వివిద ప్రాతిపదికల ఆధారంగా కేటాయిస్తుంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. 

అయితే కేంద్రం కూడా బిజెపి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఎక్కువగా మిగిలిన రాష్ట్రాలకు తక్కువగా నిధులు కేటాయిస్తుందని ప్రతిపక్షాల వాదన. అలాగే బిజెపియేతర రాష్ట్రాలకు తక్కువగా, బిజెపి రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు కేటాయిస్తోందని ఆరోపిస్తున్నాయి. కనుక రాజకీయాలకు అతీతంగా నిధులు కేటాయింపులు జరగాలని రాష్ట్రాలు కోరుకొంటున్నాయి. రాష్ట్రాల ఆరోపణలను కేంద్రం ఖండిస్తుంటుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య వాదోపవాదాలు జరుగుతుండటం ఆందోళనకరమే. 


Related Post