కాంగ్రెస్‌ గెలుపుకు జగ్గారెడ్డి ఫార్ములా కనిపెట్టారా?

February 14, 2020


img

జయాపజయాలతో సంబంధం లేకుండా దేశంలో మనుగడ సాగించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పక తప్పదు. ఎందుకంటే పార్టీ వరుస పరాజయాలు పాలవుతున్నప్పటికీ, పార్టీ పరిస్థితి గురించి ఆలోచించకుండా పార్టీలో నేతలు పదవుల కోసం పోటీ పడుతూనే ఉంటారు. అందుకు ఉదాహరణగా తెలంగాణ కాంగ్రెస్ కనిపిస్తోంది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు 2014 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నప్పటికీ, అందరూ కలిసికట్టుగా గెలుపుకోసం పనిచేయకుండా, తమవారికి పార్టీ టికెట్లు ఇప్పించుకోవడానికి, పిసిసి అధ్యక్ష పదవి కోసం పైరవీలు చేసుకొంటూ కాలక్షేపం చేయడం కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఓడిపోయింది. ఆ తరువాత ఫిరాయింపుల కారణంగా నానాటికీ పార్టీ బలహీనపడుతున్నప్పటికీ కాంగ్రెస్‌ నేతలు తమలో తాము కీచులాడుకొన్నారే తప్ప పార్టీని బలపరుచుకోవడానికి కృషి చేయలేదు.

2018 అసెంబ్లీ ఎన్నికలలో కూడా మళ్ళీ టికెట్ల కోసం ఆరాటాలు, పోరాటలతోనే సరిపోయింది. పైగా ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టిడిపి, టిజేఎస్‌, సిపిఐ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంతో వాటితో టికెట్ల పంపకాలపై లొల్లితో పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది. దాంతో పూర్తి అయోమయస్థితిలో ఎన్నికలకు వెళ్ళి దారుణంగా ఓడిపోయారు. 

ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతలు కాస్త కలిసికట్టుగా పనిచేయడంతో సత్ఫలితాలు సాధించగలిగారు. కానీ మళ్ళీ షరా మామూలే. పిసిసి అధ్యక్షపదవి కోసం పోటీ మొదలైంది. రేసులో నేనున్నానంటే నేను కూడా ఉన్నానని కాంగ్రెస్‌ నేతలు ప్రకటించుకొంటున్నారు. సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేడు మళ్ళీ మరోసారి రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియాను కలిసి ఈసారి నాకు అవకాశం ఇవ్వాలని కోరాను. త్వరలోనే డిల్లీ వెళ్ళి సోనియా, రాహుల్‌ గాంధీలను కలిసి కోరుతాను. గతంలోలాగ ‘ఎమోషనల్‌ పాలిటిక్స్‌’ ఇప్పుడు నడువవు. ప్రజల నాడిని పసిగట్టడం వచ్చినవారిదే విజయం. అలాగే అభివృద్ధి నినాదం కూడా సత్ఫలితాలు ఇస్తుంది. ఇక ఎన్నికలలో డబ్బు ప్రాధాన్యతను ఎవరూ కాదనలేరు. పార్టీలో అందరినీ కలుపుకుపోగలిగిన నావంటి వారికి ఈసారి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తప్పకుండా అధికారంలోకి తీసుకువస్తాను,” అని అన్నారు.  

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు జగ్గారెడ్డి కనిపెట్టిన ఈ ఫార్ములాను 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలోనే ఉపయోగించుకొని ఉండి ఉంటే నేడు కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి దుస్థితి కలిగి ఉండేది కాదు కదా? వరుసగా రెండుసార్లు  ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలవలనే ఏదో మహాద్భుతం జరగాలి. అది సాధ్యమేనా? జగ్గారెడ్డే చెప్పాలి.


Related Post