త్వరలో రజనీకాంత్‌ పాదయాత్ర?

February 10, 2020


img

ప్రముఖ తమిళసినీ నటుడు రజనీకాంత్‌ రాజకీయపార్టీ పెడతానని చాలా ఏళ్ళుగా చెపుతున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఏదో కారణాలతో వాయిదా వేస్తున్నారు. అయితే 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తామని చాలా కాలం క్రితమే ప్రకటించారు కనుక ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలలో రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారంటూ మళ్ళీ తమిళ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మధురై లేదా తిరుచ్చిలో బహిరంగసభను ఏర్పాటు చేసి పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటించవచ్చని తెలుస్తోంది. 

ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే దాని అధినేత తప్పనిసరిగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఫార్ములాను ఏపీలో టిడిపి, వైసీపీలు అమలుచేసి సత్ఫలితాలు సాధించాయి కనుక రజనీకాంత్‌ కూడా తమిళనాడులో పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వయసులో ఆయన పాదయాత్ర చేయడం కష్టం కనుక రాష్ట్రవ్యాప్తంగా బహిరంగసభలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవ్వాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్-మే నెలలలో పార్టీని ప్రకటించి, సెప్టెంబర్ నుంచి ప్రజల మద్యకు వెళ్ళబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

రజనీకాంత్ ఇప్పటికే అనేకసార్లు ఇలాగే హడావుడి చేసి చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు కనుక ఈసారైనా ధైర్యం చేసి పార్టీని స్థాపిస్తారా లేదా?అంటే లేదనే చెపుతున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌. సరైన హిట్స్ లేక ఇబ్బందిపడుతున్న రజనీకాంత్ తన సినిమా విడుదలకు ముందు ప్రతీసారి ఇలాగే హడావుడి చేసి హైప్ సృష్టించుకోవడం పరిపాటిగా మారిందని, ఈసారి కూడా అదే జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక రజనీకాంత్ రాజకీయప్రవేశం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. 


Related Post