గల్ఫ్ ఎందుకు వెళుతున్నారో అర్ధం కాదు: కేసీఆర్‌

January 25, 2020


img

సిఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాది అవకాశాలు బాగా పెరిగాయి. అందుకే దేశంలో ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి తెలంగాణలో పనిచేసుకొంటున్నారు. మరి తెలంగాణలోనివారు ఇంకా గల్ఫ్ దేశాలకు ఎందుకు వెళుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. అయితే గల్ఫ్ దేశాలకు వెళుతున్న మన తెలంగాణవారి సంక్షేమం కోసం త్వరలోనే గల్ఫ్ పాలసీని ప్రకటిస్తాం. అంతకంటే ముందు ఒకసారి నేనే స్వయంగా గల్ఫ్ దేశాలలో పర్యటించి అక్కడ మనవారి పరిస్థితులు తెలుసుకొనే ప్రయత్నం చేస్తాను,” అని చెప్పారు. 

తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చక్కటి విధానాల వలన రాష్ట్రంలో శరవేగంగా  పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాలను సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దాంతో ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన ఐ‌టి కంపెనీలు ఇప్పుడు వరంగల్, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలలో కూడా ఏర్పడుతున్నాయి. అలాగే ప్రభుత్వం అమలుచేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ పధకంతో రాష్ట్రంలో చేనేత, మరమగ్గాలవారికి ఏడాదిపొడవునా పనిదొరుకుతోంది. రాష్ట్రంలో కొత్తగా అనేక పెద్దపెద్ద వాణిజ్యసంస్థలు, ఫార్మా కంపెనీలు వచ్చాయి. కనుక గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాది అవకాశాలు గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ ఆర్ధిక సమస్యలలో చిక్కుకొన్న కొంతమంది నిరుపేదలు దళారుల మాయమాటలు నమ్మి అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ నానా కష్టాలు అనుభవిస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కారాలు వెతకాలనుకోవడం చాలా మంచి ఆలోచనే. అది ఎంత త్వరగా ఆచరణలో పెడితే అంత మంచిది.


Related Post