టిఆర్ఎస్‌ ఆ మాటకు కట్టుబడి ఉంటుందా?

January 20, 2020


img

మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ తిరుగుబాటు అభ్యర్ధులను మళ్ళీ పార్టీలో చేర్చుకోమని, వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. కనుక మంత్రులు కూడా అదేమాట మరికాస్త గట్టిగా చెపుతున్నారు. అయితే గత అనుభవాలను బట్టి చూసినట్లయితే ఎన్నికలలో గెలిచిన తిరుగుబాటు అభ్యర్ధులను టిఆర్ఎస్‌లో మళ్ళీ చేర్చుకోకుండా ఉంటుందా? అనే అనుమానం కలుగడం సహజం. ఎందుకంటే, ఒక్కో అభ్యర్ధిని గెలిపించుకోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలు స్థానిక నేతల వరకు ఎంతో కృషి చేస్తుంటారు. ఒకవేళ ఆ అభ్యర్ధి ఓడిపోతే వారి శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అప్పుడు గెలిచిన అభ్యర్ధి వచ్చి పార్టీలోకి చేరుతానంటే ఎవరూ కాదనలేరు. దాని వలన పార్టీ బలంగా ఉంటుంది. అందుకే కాంగ్రెస్‌, టిడిపి, వైసీపీలకు చెందిన ఎమ్మెల్యేలను టిఆర్ఎస్‌లో చేర్చుకొన్న సంగతి అందరికీ తెలుసు. అయితే తిరుగుబాటు అభ్యర్ధుల వలన ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులకు నష్టం కలుగకూడదనే ఉద్దేశ్యంతోనే టిఆర్ఎస్‌ వారిని నయన్నో, భయన్నో బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోందని చెప్పవచ్చు. కానీ నేటితో ఎన్నికల ప్రచారం కూడా ముగిసిపోతుంది కనుక ఇప్పుడు తిరుగుబాటు అభ్యర్ధులు వెనక్కు తగ్గినా జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. కనుక వారిలో గెలిచినవారు ‘తమ పట్టణాల అభివృద్ధి కోసం’ టిఆర్ఎస్‌లో చేరాలనుకోవడం, వారికి మళ్ళీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించడం రెండూ ఖాయమేనని భావించవచ్చు. లేకుంటే వారు కాంగ్రెస్‌ లేదా బిజెపిలో చేరితే టిఆర్ఎస్‌కే నష్టం.   



Related Post